ఎక్కడికైనా ఒంటరిగా వస్తానన్న ఎమ్మెల్యే బయటకు వచ్చి సమాధానం చెప్పలేకపోయారు: మండలి బుద్దప్రసాద్

  • ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుపై మండలి బుద్దప్రసాద్ ఆగ్రహం
  • సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ధర్నా చేస్తే దాడి చేయించారని ఆరోపణ
  • గతంలోనూ పలువురిపై దాడికి పాల్పడ్డారన్న బుద్ధప్రసాద్
ఎక్కడికైనా తాను ఒంటరిగా వస్తానని చెప్పిన ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు శుక్రవారం కూడా ఒంటరిగా తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి ధర్నా చేస్తున్న వారికి సమాధానం చెప్పలేకపోయారా? అని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగితే ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేయించారని, దీనిని తాము ఖండిస్తున్నామన్నారు.

ఈ దాడిపై వివరణ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే తాను ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచి తన క్రిమినల్ మైండ్‌ను ఉపయోగించి దాడికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వెళ్లిపోమని చెప్పి మరీ దాడికి పాల్పడ్డారన్నారు. ఎక్కడికైనా తాను ఒంటరిగా వస్తానని చెప్పి, ధర్నా చేస్తున్న వారి వద్దకు వెళ్లి సమాధానం చెప్పలేకపోయారన్నారు. గతంలోను ఆయన దాడికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయన్నారు.

గతంలో బ్యాంకు లోన్ కట్టమని అడిగినందుకు బ్యాంకు మేనేజర్‌ను బ్యాంకు నుంచి బయటకు లాగి కొట్టారని, నాగాయలంకలో నాబార్డు చైర్మన్ ఎదుట స్థానిక ఎంపీ ప్రధాన అనుచరుడిని కొట్టారన్నారు. అవనిగడ్డలో బంద్ నిర్వహించకుండా పోలీసు కవాతు నిర్వహించారని, స్వచ్చంధంగా దుకాణాలు మూసిన వ్యాపారులను బెదిరించి తెరిపించారన్నారు. నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారన్నారు.


More Telugu News