ఈటల రాజేందర్ ఈసారి హుజూరాబాద్ లోనే ఘోరంగా ఓడిపోబోతున్నాడు: మంత్రి మల్లారెడ్డి

  • తెలంగాణలో ఎన్నికల కోలాహలం
  • ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి మల్లారెడ్డి
  • కాంగ్రెస్ అంటేనే స్కాములు అని విమర్శలు
  • ఓడిపోయేవాళ్లు ఎన్ని మాటలైనా చెబుతారంటూ బీజేపీపై వ్యాఖ్యలు
  • బీఆర్ఎస్ కు 100-105 స్థానాలు వస్తాయని ధీమా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలందరూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అదే సమయంలో నేతల మధ్య మాటల యుద్ధం కూడా ముదిరింది. తాజాగా, ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి మల్లారెడ్డిని మీడియా పలకరించింది. 

ఇవాళ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని మల్లారెడ్డి వెల్లడించారు. తాను ఎక్కడికి వెళ్లినా...  సీఎం కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి వస్తున్నాడంటూ ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో బాగుందని, మల్లారెడ్డికి మా మద్దతు ఉంటుందని ప్రజలందరూ చెబుతున్నారని వివరించారు. 

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుండడంపైనా మల్లారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఒక పప్పు... అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీకి ఫేస్ వాల్యూ లేదని అన్నారు. మా పార్టీని కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ వాళ్లు, వారి నాయకత్వం ఏంటో చూసుకోవాలి.. వారి ముత్తాతలు, తాతల హయాం నుంచి కుటుంబ పాలనే కదా అని మంత్రి మల్లారెడ్డి దెప్పిపొడిచారు.  

కాంగ్రెస్ అంటేనే స్కాములు అని, అందుకే ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా... ఫ్లాప్ అవడం ఖాయమని పేర్కొన్నారు. ఏం చేశారని ప్రజల్లోకి వెళ్లి ఓట్లడుగుతారు అంటూ మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మేం ఈ స్కాములు చేశాం అని ప్రజల్లోకి వెళతారా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా నాలుగేళ్ల పాటు కనీసం ప్రజలకు ముఖం చూపించాడా అని ప్రశ్నించారు. 

అధికారం మాదేనని బీజేపీ అంటుండడంపైనా మల్లారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఓడిపోయేవాళ్లు ఎన్ని మాటలైనా చెబుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీకి రెండు మూడు స్థానాలు, కాంగ్రెస్ కు ఆరేడు స్థానాలు వస్తాయని అన్నారు. ఇప్పుడున్న స్థానాలే వస్తాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటున్న ఈటల రాజేందర్ కు ఏం చూసి ఓటేస్తారని ప్రశ్నించారు. అసలు, ఈటలకు ఎందుకు ఓటేయాలని పేర్కొన్నారు. ఈటల ఈసారి హుజూరాబాద్ లోనే ఘోరంగా ఓడిపోబోతున్నాడని తెలిపారు. 

బీఆర్ఎస్ అంటే స్కీములు అని, ఈ ఎన్నికల్లో తమకు 100 నుంచి 105 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మేడ్చల్ నియోజకవర్గ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇక్కడ వజ్రేష్ యాదవ్ (కాంగ్రెస్) అని ఒకడున్నాడు. వాడు చేసేవన్నీ భూ కబ్జాలే. కొన్ని కబ్జాలను నేనే విడిపించాను. ఈ వజ్రేష్ యాదవ్ ను విడిచిపెట్టేది లేదు... జైలుకు పంపించడం ఖాయం" అని మల్లారెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News