పురుగుల మందుతో ట్యాంక్‌బండ్ సమీపంలో మోత్కుపల్లి హల్‌చల్

  • దళితులకు మంచి జరుగుతుందని తాను పార్టీలో చేరానన్న మోత్కుపల్లి
  • దళితబంధు అమలు కాకుంటే గడ్డిమందు తాగి చనిపోతానని గతంలోనే చెప్పానన్న మోత్కుపల్లి
  • చంద్రబాబు అరెస్ట్‌తో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ 30 సీట్లలో ఓడిపోతుందని జోస్యం
  • రేవంత్ రెడ్డి అందరి ఇళ్లకు వెళ్తున్నాడు కానీ తన ఇంటికి రావడం లేదని విమర్శ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మి తాను పొరపాటు చేశానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో హల్‌చల్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... దళితులకు అన్యాయం జరిగితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దళతబంధు అమలు కాకపోవడంతో దళిత యువత తనకు సందేశాలు పంపిస్తోందన్నారు. కేసీఆర్ ముహూర్తం పెడితే తాను గడ్డిమందు తాగి చనిపోతానని వ్యాఖ్యానించారు.

తాను దళితబంధును తీసుకువస్తున్నానని కేసీఆర్ తనను స్వయంగా ఆహ్వానిస్తే పార్టీలోకి వెళ్లానని, దళితులకు మేలు జరుగుతుందనుకున్నానని, కానీ అలా జరగడం లేదన్నారు. దళిత బంధు అమలు కాకుంటే తాను గడ్డిమందు తాగుతానని గతంలో చెప్పానన్నారు. అందుకే ఈ గడ్డి మందు డబ్బాను పట్టుకొని వచ్చానన్నారు. కేసీఆర్ గట్టిగా ఉన్నాడని, ఎలాగూ చావడని, తానైనా చనిపోతానన్నారు. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రవళిక ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముప్పై సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వాలన్నారు. తనకు తుంగతుర్తి సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందరి ఇళ్లకు వెళ్తున్నారని, కానీ దళితుడనైన తన ఇంటికి మాత్రం రావడం లేదన్నారు.


More Telugu News