పాకిస్థాన్ సాంగ్ ప్లే చేయొద్దని చెప్పి, రోహిత్ మంచి పనే చేశాడు: మైఖేల్ వాన్
- పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ ఆర్థర్ వ్యాఖ్యలను టార్గెట్ చేసిన వాన్
- దిల్ దిల్ పాకిస్థాన్ సాంగ్ ప్లే చేసి ఉండే పాక్ గెలిచేదంటూ వ్యంగ్యం
- ఇతర కెప్టెన్లు ఎవరూ ఆలోచించని విధంగా రోహిత్ చేశాడని వ్యాఖ్య
వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 14న భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగడం, దీనిపై పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మైక్ ఆర్థర్ విమర్శలు చేయడం గుర్తుండే ఉంటుంది. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ సాంగ్ ప్లే చేయలేదని ఆర్థర్ విమర్శలు చేశాడు. ఈ మ్యాచ్ గురించి ఆర్థర్ చేసిన కామెంట్లకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘దిల్ దిల్ పాకిస్థాన్ సాంగ్ ను ప్లే చేయవద్దని, డీజేకి రోహిత్ శర్మ చెప్పి మంచి పనే చేశాడు. లేదంటే పాక్ గెలిచి ఉండేది’’ అని వాన్ వ్యంగ్యంగా చమత్కారం వదిలాడు.
‘‘ఈ వరల్డ్ కప్ లో దిల్ దిల్ పాకిస్థాన్ సాంగ్ ను ప్లే చేయవద్దని డీజేని కోరి రోహిత్ శర్మ మంచి పనే చేశాడు. ఒకవేళ ఈ సాంగ్ ను ప్లే చేస్తే పాకిస్థాన్ గెలిచేది. ఇది నిజంగా గొప్ప చర్య. ఎందుకంటే చాలా మంది కెప్టెన్లు అసలు దీని గురించి (డీజే, మ్యూజిక్) ఆలోచించరు. వారందరికంటే రోహిత్ ముందున్నాడు’’ అని వాన్ పేర్కొనడం గమనార్హం. ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ తో పాడ్ కాస్ట్ సందర్భంగా వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ ఆటగాళ్లను మార్చిన తీరును సైతం వాన్ ప్రశంసించాడు.