సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే: లోకేశ్ వీడియో ట్వీట్

  • టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యం
  • సైకిల్ యాత్ర చేస్తున్న వారిపై అసభ్యపదజాలంతో దాడి
  • జెండాలు పీకించి, చొక్కాలు విప్పించిన వైనం
  • పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద ఘటన
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దౌర్జ్యన్యాలకు అంతేలేకుండా పోతోందని, సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరంగానే చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో సైకిల్ యాత్రగా సాగుతున్న టీడీపీ కార్యకర్తలపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన కార్యకర్తలపై మంత్రి అనుచరుడు సూరి దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

సైకిల్ పై ఉన్న జెండాలు పీకించి, వారు వేసుకున్న పసుపు రంగు చొక్కాలు విప్పించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశాడు. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ ట్వీట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని లోకేశ్ తన ట్వీట్ లో మండిపడ్డారు. ‘బాబుతో నేను’ పేరుతో సైకిల్ యాత్ర చేపట్టిన కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, దాడులు చేయడానికా అంటూ ముఖ్యమంత్రి జగన్ ను లోకేశ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి వారిని నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.


More Telugu News