అసలు 5వ స్థానంలో బ్యాటింగ్‌కు శార్ధూల్ ఠాకూర్ ను పంపాలనుకున్నాం: రోహిత్ శర్మ వెల్లడి

  • బంగ్లాపై మ్యాచ్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలనుకున్న రోహిత్
  • అప్పటికే కేఎల్ రాహుల్ మైదానంలోకి రావడంతో బ్రేక్
  • బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో హిట్‌మ్యాన్ వెల్లడి
వరల్డ్ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా వరుసగా నాలుగవ విజయాన్ని బంగ్లాదేశ్‌పై నమోదు చేసింది. 257 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించగా.. సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ శతకం సాధించడంలో మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ చక్కటి సహకారం అందించాడు. కోహ్లీకి స్ట్రయికింగ్ వచ్చేలా తోడ్పాటునిచ్చాడు. వీరిద్దరూ చివరివరకూ నాటౌట్‌గా నిలిచారు. అయితే నిజానికి ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో పేస్-బౌలర్, ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ను బ్యాటింగ్‌కు దింపాలని భావించినట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ తెలిపాడు. 


5వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి శార్ధూల్ ఠాకూర్ సిద్ధంగా ఉన్నాడని రోహిత్ చెప్పాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఔట్ అయ్యాక రాహుల్ అప్పటికే గ్రౌండ్‌లోకి వెళ్ళిపోవడంతో ఆల్ రౌండర్ తన అవకాశాన్ని కోల్పోయాడని రోహిత్ అన్నాడు. శార్ధూల్‌ను సిద్ధంగా ఉండాలని చెప్పిన బంతికే శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడని, దీంతో కేఎల్ రాహుల్ వెంటనే మైదానంలోకి వెళ్లిపోయాడని, లేదంటే శార్ధూల్ ఠాకూర్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేసి ఉండేవాడని రోహిత్ వెల్లడించాడు.

బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియోలో ఈ మేరకు శుభ్ మన్ గిల్‌తో రోహిత్ శర్మ ఈ విషయాన్ని చెప్పాడు. శార్దూల్ బ్యాటింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని, దానికి రోహిత్ ఉల్లాసంగా స్పందించాడని గిల్ పేర్కొన్నాడు. అతనికి కూడా అవకాశం వస్తుందని, అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని శార్ధూల్‌ని ఉద్దేశించి రోహిత్ వ్యాఖ్యానించాడు.


More Telugu News