అలాంటి తప్పు కోహ్లీ ఎప్పుడూ చేయడు.. సునీల్ గవాస్కర్

  • సెంచరీ చేయడంపై దృష్టి పెట్టాలని గిల్, అయ్యర్ కు సూచన
  • బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఔటైన తీరుపై అసంతృప్తి
  • సహనం కోల్పోయి వికెట్ పారేసుకుంటున్నారన్న గవాస్కర్
శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. ఇద్దరూ టాపార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చినా సెంచరీపై దృష్టి పెట్టట్లేదని సునీల్ గవాస్కర్ విమర్శించారు. ఈ విషయంలో గిల్ అప్పుడప్పుడైనా సెంచరీ చేస్తుండగా అయ్యర్ శతకం సాధించడంలేదని అన్నారు. అసహనంతో ప్రత్యర్థికి చేజేతులా వికెట్ సమర్పించుకుంటున్నారని చెప్పారు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గిల్, అయ్యర్ ఔటైన తీరుపై గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యర్ సహనం కోల్పోయి.. అనవసరంగా వికెట్‌ ఇచ్చాడని అన్నారు. గిల్ కూడా అలాగే వికెట్‌ ఇచ్చాడన్నారు. విరాట్ కోహ్లీ మాత్రం అలాంటి తప్పు చేయడని గవాస్కర్ చెప్పారు.

వ్యక్తిగత స్కోరు 70, 80 చేరినపుడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంపై దృష్టి పెడతాడని, వికెట్ ను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాడని గవాస్కర్ చెప్పారు. మిగతా సందర్భాలలోనూ అంత తేలికగా సహనం కోల్పోడని ప్రశంసించారు. కోహ్లీ వికెట్ కోసం బౌలర్లు చాలా శ్రమించాల్సి ఉంటుందన్నారు. భారీ స్కోర్ సాధించడానికి ఇదే మంచి పద్ధతి అని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించాలంటూ శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లకు హితవు పలికారు. వచ్చిన అవకాశాలను వదులుకుంటే మళ్లీ రావని గవాస్కర్ వారిని హెచ్చరించారు.


More Telugu News