అర్ధరాత్రి పోలీసును కారుతో ఢీకొట్టి పారిపోయిన ఆగంతుకుడు

  • బుధవారం రాత్రి చిలకలగూడలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఘటన
  • తనను ఆపబోయిన కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి పారిపోయిన ఆగంతుకుడు
  • చేయి విరిగిన కానిస్టేబుల్‌‌కు ఆసుపత్రిలో చికిత్స, ప్రాణాపాయం లేదన్న వైద్యులు
  • కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుల కోసం పోలీసుల గాలింపు 
హైదరాబాదులోని చిలకలగూడలో బుధవారం రాత్రి దారుణం జరిగింది. వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ పోలీసును ఆగంతుకుడు తన కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. పోలీసు కారును ఆపమన్నా వినకుండా వేగంగా దూసుకెళుతూ అతడిని ఢీకొట్టాడు. గోపాలపురం పోలిస్ స్టేషన్ పరిధిలో చిల్లరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
తనిఖీల కోసం పోలీసులు అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బ్యారికేడ్లను దాటుకుని కారు ముందుకు వెళ్లిపోతుండగా కానిస్టేబుల్‌ మహేశ్ కారుకు ఎదురొచ్చి ఆపమని సైగ చేశాడు. కానీ డ్రైవర్ పోలీసును ఖాతరు చేయకుండా అతడిని కారుతో ఢీకొట్టాడు. దీంతో, కానిస్టేబుల్ ఎగిరిపక్కకు పడ్డాడు. 

గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించగా అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అతడి చేయి విరిగినట్టు పేర్కొన్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడి వివరాలు సేకరిస్తున్నారు.


More Telugu News