మీ బంగారం స్వచ్ఛతను తెలిపే యాప్

  • బీఐఎస్ కేర్ యాప్ సాయంతో తెలుసుకునే అవకాశం
  • అన్ని ఆభరణాలకు హాల్ మార్క్ హెచ్ యూఐడీ కోడ్
  • ఈ కోడ్ ఆధారంగా వర్తకుడు, ఆభరణం వివరాలు ప్రత్యక్షం
కొత్తగా కొనుగోలు చేసే ఆభరణాలు లేదా తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునే సులభ మార్గం ఉంది. ఇందుకు బీఐఎస్ కేర్ యాప్ ఉపకరిస్తుంది. అన్ని బంగారం ఆభరణాలపై హాల్ మార్క్ హెచ్ యూఐడీ కోడ్ ముద్రించడాన్ని కేంద్ర సర్కారు తప్పనిసరి చేసింది. ప్రతి ఆభరణానికీ ఈ కోడ్ భిన్నంగా ఉంటుంది. పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుండడం సహజమే. దసరా, దీపావళి సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసే వారు, బీఐఎస్ హాల్ మార్క్ ఉన్నవే కొనుగోలు చేయాలి. ఆభరణాలతోపాటు, బంగారంతో చేసే వస్తువులు, కళాకృతులకు సైతం హాల్ మార్క్  తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది,.

హాల్ మార్క్ హెచ్ యూఐడీ అనేది ఆరు అక్షరాలు, నంబర్లతో కూడి  ఉంటుంది. దీని ఆధారంగా అది నకిలీదా, అసలైన గుర్తింపు ఉన్నదా అన్నది తెలుసుకోవచ్చు. ఇందుకోసం బీఐఎస్ కేర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ తెరిచి పేరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలు ఎంటర్ చేయాలి. ఫోన్ కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే యాప్ తెరుచుకుంటుంది. ‘చెక్ లైసెన్సింగ్ డిటైల్స్’ వద్ద క్లిక్ చేయాలి. మీరు కొన్నది హాల్ మార్క్ ఆభరణం అయితే ‘వెరిఫై హెచ్ యూఐడీ’ను సెలక్ట్ చేసుకోవాలి. అది నిజమైన హాల్ మార్క్ గుర్తింపు అయితే, ఎక్కడ కొనుగోలు చేశారో ఆ జ్యుయలర్స్ వివరాలు, బంగారం ఆభరణం వివరాలన్నీ కనిపిస్తాయి.


More Telugu News