భారత్ లో పర్యటించే తన పౌరులకు కెనడా హెచ్చరికలు!

  • భారత్ లోని కెనడా కాన్సులేట్లలో కార్యకలాపాల నిలిపివేత
  • సాయం కోసం ఢిల్లీ హై కమిషన్ ను సంప్రదించాలని సూచన
  • భారత్ లో బెదిరింపులు, వేధింపులకు గురికావచ్చని హెచ్చరిక
గత్యంతరం లేక భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను ఉపసంహరించుకున్న కెనడా.. భారత్ లో పర్యటించే తన పౌరులకు ప్రయాణ హెచ్చరికలు చేసింది. కెనడా వ్యతిరేక ప్రదర్శనలు, బెదిరింపులు లేదా వేధింపులు ఎదురు కావచ్చంటూ తన పౌరులకు సూచించింది. దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న వెంటనే ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

బెంగళూరు, చండీగఢ్, ముంబైలోని కెనడా కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో వ్యక్తిగత హాజరుతో కూడిన కార్యకలాపాలను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అంటే ఈ కాన్సులేట్ లలో కార్యకలాపాలు నిలిపివేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. కాన్సులర్ సాయం కోసం, ఇతర సమాచారం కోసం ఢిల్లీలోని కెనడా హై కమిషన్ ను సంప్రదించాలని సూచించింది. 

భారత్ లోని అన్ని కెనడా కాన్సులేట్లలో వ్యక్తిగత హాజరు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. భారత్ 41 మంది కెనడా దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేయడంతో, వారిని వెనక్కి తీసుకుంటూ కెనడా విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేశారు.

కెనడా, భారత్ లో ఇటీవలి పరిణామాలు, నిరసనలకు పిలుపునివ్వడం, కెనడాకు వ్యతిరేకంగా ప్రతికూల సెంటిమెంట్లు మీడియాలో, సోషల్ మీడియాలో రావడాన్ని కెనడా ప్రస్తావించింది. కెనడా వ్యతిరేక నిరసనలు జరగొచ్చంటూ, కెనడా వాసులు వేధింపులు లేదా బెదిరింపులకు గురికావచ్చని తన తాజా ప్రయాణ హెచ్చరికల్లో భాగంగా కెనడా పేర్కొంది. 

‘‘ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్) లో అపరిచితులతో పెద్దగా మాట్లాడొద్దు. మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లకండి. ప్రజా రవాణాను వినియోగించుకోవద్దు. కనీసం ఒకరితో కలిసే వెళ్లండి. మీ ప్రయాణ ప్రణాళికల గురించి మీ స్నేహితుడో లేక కుటుంబ సభ్యుల్లో ఒకరికైనా తెలియజేయండి’’ అంటూ సూచనలు చేసింది.


More Telugu News