గాజాలో భారతీయుల తరలింపుపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన

  • ఇజ్రాయెల్ - హమాస్ పోరులో భారతీయులెవరూ మరణించినట్లు నివేదికలు లేవన్న భారత్
  • కేరళకు చెందిన మహిళా కేర్‌టేకర్ గాయపడి చికిత్స పొందుతున్నట్లు వెల్లడి
  • అవకాశం దొరికితే మాత్రం గాజా నుంచి బయటకు తీసుకు వస్తామన్న విదేశాంగ శాఖ
హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. గాజాలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రి వద్ద సంభవించిన పేలుడు ఘటనలో వందలాది మంది మృతి చెందారు. ఇది అందరినీ కలచివేసింది. గాజాలో పౌరుల మరణాలు, పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.

ఇక్కడి భారతీయుల పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇజ్రాయెల్ - హమాస్ పోరులో భారతీయులెవరూ మరణించినట్లు నివేదికలు లేవని తెలిపింది. కేరళకు చెందిన ఓ మహిళా కేర్‌టేకర్ మాత్రం గాయపడగా.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపింది. గాజాలో గతంలో నలుగురు భారతీయులు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్యపై స్పష్టత లేదని పేర్కొంది. గాజా నుంచి ప్రస్తుతం అయితే భారతీయులను తరలించే పరిస్థితి లేదని, అవకాశం దొరికితే మాత్రం బయటకు తీసుకు వస్తామని తెలిపింది.

కాగా, ఆపరేషన్ అజయ్ పేరిట కేంద్రం ఇప్పటి వరకు ఐదు విమానాల్లో 18 మంది నేపాలీలు సహా 1200 మందిని ఇజ్రాయెల్ నుంచి భారత్ కు తరలించింది. స్థానిక పరిస్థితులను పరిశీలించి అవసరమైతే మరిన్ని విమానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. అల్ అహ్లీ ఆసుపత్రి ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.


More Telugu News