సిక్సర్‌తో సెంచరీ.. జట్టుకు విజయం.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ వీరంగం

  • ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
  • కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర
  • కోహ్లీ ఖాతాలో 48వ సెంచరీ
  • వరుసగా మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పరాజయం
ప్రపంచకప్‌లో అసలైన మజా ఈ రోజు అభిమానులకు లభించింది. బంగ్లాదేశ్‌తో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 41.3 ఓవర్లలోనే చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం కంటే కూడా అభిమానులను ఆనందానికి గురిచేసిన విషయం కింగ్ కోహ్లీ సెంచరీ. భారత్ విజయానికి రెండు పరుగులు.. విరాట్ సెంచరీకి మూడు పరుగులు అవసరమైన వేళ.. నాసుమ్ అహ్మద్ వేసిన 42వ ఓవర్ మూడో బంతిని స్టాండ్స్‌లోకి తరలించి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా తన ఖాతాలో సెంచరీ వేసుకున్నాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 48వ సెంచరీ. బంగ్లాదేశ్‌కు వరుసగా ఇది మూడో పరాజయం కాగా.. ఇండియాకు ఇది వరుసగా నాలుగో చేజింగ్ విజయం.

48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ మరోమారు నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ శతకం (103) నమోదు చేశాడు. శుభమన్ గిల్ (53) అర్ధ సెంచరీ పూర్తిచేసుకోగా, శ్రేయాస్ అయ్యర్ 19, కేఎల్ రాహుల్ 34 పరుగులు చేశాడు.

అంతకుముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తంజీద్ హసన్ (51), లిటన్ దాస్ (66) అర్ధ సెంచరీలు చేశారు. ముష్ఫికర్ రహీం 38, మహ్మదుల్లా 46 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.


More Telugu News