I.N.D.I.A. కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ వార్నింగ్!

I.N.D.I.A. కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ వార్నింగ్!
  • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విభేదాలు
  • రాష్ట్రస్థాయిలో పొత్తులు పని చేయవంటే కూటమిలో చేరేవాళ్లం కాదన్న అఖిలేశ్
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచన చేస్తామని స్పష్టీకరణ
I.N.D.I.A. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. మరికొన్ని రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆరేడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న సమయంలో అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిలోని ఇతర పార్టీలను కాంగ్రెస్ ఫూల్ చేస్తోందన్నారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు పని చేయవని చెబుతోందని, అలా చెప్పి ఉంటే ముందే I.N.D.I.A. కూటమికి దూరంగా ఉండేవారమని చెప్పారు. ఇప్పటికీ మించిపోయింది లేదని లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై తమ పార్టీ పునరాలోచన చేస్తోందన్నారు.

మధ్యప్రదేశ్ అసంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి కాంగ్రెస్, ఎస్పీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సమాజ్‌వాది పార్టీ... కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. I.N.D.I.A. పేరుతో జాతీయస్థాయిలో కూటమి ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ కాంగ్రెస్ రాష్ట్రాలకు వర్తించదని చెబుతోందని అంటోంది.

మధ్యప్రదేశ్‌లో పోటీకి సంబంధించి తాను కమల్ నాథ్‌తో మాట్లాడానని, పార్టీ పనితీరు గురించి, గతంలో ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల గురించి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థుల గురించి చర్చించానన్నారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించిందని, కానీ వాళ్లు అభ్యర్థులను ప్రకటించేముందు తమను సంప్రదించలేదన్నారు. రాష్ట్రస్థాయిలోను కూటమి లేదనుకుంటే తాము జాతీయస్థాయిలో వారితో ఎలా కలుస్తామన్నారు. వాళ్లు ఎలా ఉంటే తాము అలాగే ఉంటామన్నారు.


More Telugu News