ముఖ్యమంత్రి పదవిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • నవంబర్ 25న ఒకే విడతలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు
  • తాను సీఎం పదవి వదిలేయాలనుకున్నప్పటికీ ఆ పదవి వదలడం లేదని వ్యాఖ్య
  • తనలో ఏదో శక్తి ఉందన్న అశోక్ గెహ్లాట్
  • రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి తనను మూడుసార్లు ఎంపిక చేశారన్న గెహ్లాట్
తనను ముఖ్యమంత్రి పదవి ఎప్పటికీ వదిలిపెట్టదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేవుడి దయతో తనను నాలుగోసారి సీఎంగా చూడాలని ఓ మహిళ తనతో చెప్పారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టాలని అనుకుంటున్నప్పటికీ ఆ పదవి తనను వదలడం లేదన్నారు. భవిష్యత్తులోను తనను విడిచిపెట్టదన్నారు.

తనలో ఏదో ఉందని, అందుకే పార్టీ అధిష్ఠానం తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందన్నారు. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయమైనా ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. సోనియా గాంధీ జాతీయ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న తొలి నిర్ణయం తనను ముఖ్యమంత్రిని చేయడమే అన్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో జాప్యం ఎందుకు చేసిందన్న ప్రశ్నకు గెహ్లాట్ స్పందిస్తూ... ప్రతిపక్ష బీజేపీ మాత్రమే ఈ అంశంపై చింతిస్తోందన్నారు.


More Telugu News