ప్రియాంకాగాంధీపై సెటైర్లు వేసిన కవిత

  • కుటుంబ రాజకీయాల గురించి ప్రియాంక మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న కవిత
  • గాంధీలది కుటుంబ పాలన కాదా? అని ప్రశ్న
  • కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేవలం మూడు గంటల సేపే కరెంట్ వస్తుందని విమర్శ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ప్రియాంకాగాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ, నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ, ఇందిర కూతురు రాజీవ్ గాంధీ, రాజీవ్ కూతురు ప్రియాంకా గాంధీ అని చెప్పిన కవిత... ఇది కాదా కుటుంబ పాలన? అని ఎద్దేవా చేశారు. మాట్లాడే ముందు స్క్రిప్ట్ ను సరిచూసుకోవాలని అన్నారు. 

కాళేశ్వరం, మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్ల రూపాయలని... అలాంటప్పుడు వీటిలో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కవిత ప్రశ్నించారు. పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తే అభాసుపాలు అవుతారని అన్నారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పారేయాలని అంటున్నారని.. బంగాళాఖాతంలో పారేస్తే భూమి హక్కు ఎవరిది అనేది ఎలా తెలుస్తుందని, రైతుబంధు ఎవరికి వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు పొరపాటున కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేవలం మూడు గంటల సేపే కరెంట్ వస్తుందని చెప్పారు.


More Telugu News