పాలస్తీనాపై మారిన భారత్ వైఖరి.. గల్ఫ్ లో మన వాళ్లకు కష్టాలు తెస్తుందా?
- ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించిన భారత్
- హమాస్ మిలిటెంట్ల దాడికి తీవ్ర ఖండన
- మొదట్నుంచీ ప్రత్యేక పాలస్తీనా అన్నది భారత్ విధానం
- మారిన వైఖరితో గల్ఫ్ లో భారతీయులకు ఇబ్బందికరంగా మారుతుందన్న భావన
ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లు, క్షిపణులు, సముద్ర, భూతల మార్గం ద్వారా దాడులకు దిగడం తెలిసిందే. సుమారు 500 మంది ఇజ్రాయెల్ వాసులను తొలిరోజే అంతమొందించారు. 5,000 రాకెట్లను హమాస్ మిలిటెంట్లు ప్రయోగించారు. దీంతో భారత ప్రధాని ఇజ్రాయెల్ కు సంఘీభావం తెలిపారు. నెతన్యాహు ప్రధాని మోదీకి కాల్ చేసిన సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు.
‘‘ఇజ్రాయెల్ పై ఉగ్రవాదుల దాడి వార్తలు షాక్ కు గురి చేశాయి. అమాయకులైన బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. ఈ కష్టసమయంలో ఇజ్రాయెల్ కు భారత్ బాసటగా నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. భారత వైఖరి అరబ్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించినట్టు కనిపిస్తోంది. భారత్ ముందు నుంచి ప్రత్యేక పాలస్తీనాకు మద్దతు పలుకుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కు మద్దతు పలకడాన్ని అరబ్ ప్రపంచానికి చెందిన మేధావులు, నిపుణులు తప్పుబడుతున్నారు.
ఐఐఎస్ఎస్ లో మధ్యప్రాచ్యం నిపుణుడిగా పనిచేస్తున్న హసాన్ అల్ హసాన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘హమాస్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే భారత ప్రధాని పక్షపాత, స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. ఇజ్రాయెల్ కు బాసటగా ట్వీట్ చేశారు’’ అని పేర్కొన్నారు. అరబ్ ప్రపంచానికే చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అబ్దుల్ ఖలీద్ అబ్దుల్లా సైతం.. భారత్ క్రమంగా ఇజ్రాయెల్ అనుకూల వైఖరికి మళ్లుతున్నట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ను పూర్తిగా గుర్తించడంతోపాటు, గాజాకు వ్యతిరేకంగా ఆ దేశానికి మద్దతు తెలుపుతున్నట్టు అభిప్రాయపడ్డారు.
గల్ఫ్ దేశాల్లో భారతీయులు లక్షలాది మంది ఉపాధి పొందుతుండడం తెలిసిందే. దీంతో భారత్ తాజా వైఖరి అరబ్ దేశాల్లోని భారతీయులపై వివక్షకు దారితీయవచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది. మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ప్రధాని ట్వీట్ తర్వాత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పాలస్తీనా విషయంలో భారత వైఖరిని సుస్పష్టం చేశారు.
ఈ విషయంలో భారత్ విధానం ఎంతో కాలంగా స్థిరంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. సార్వభౌమ, స్వతంత్ర, సురక్షితమైన సరిహద్దులతో, ఇజ్రాయెల్ పక్కన ప్రశాంతతో కూడిన పాలస్తీనా ఉండాలన్నదే తమ వైఖరిగా పేర్కొన్నారు. తమ వైఖరి ఇప్పటికీ అదేనని తెలిపారు. కానీ, దీన్ని అరబ్ దేశ వాసులు పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఏ దేశంపై అయినా ఉగ్రవాద దాడులకు వ్యతిరేకమన్నది భారత్ వైఖరిగా ఉంది. ఈ కోణంలోనే ఉగ్రదాడిని ఎదుర్కొన్న ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించింది. అంతే కానీ, పాలస్తీనా ప్రత్యేక దేశం డిమాండ్ ను ఏమీ తోసిపుచ్చలేదు. మరి ఈ అంశంలో ముందుముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.