మరీ కష్టపడుతున్నారా..? అయితే మీ గుండె జాగ్రత్త సుమా!

  • విరామం లేని పనితో అధిక ఒత్తిడి
  • ఒత్తిడితో రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్
  • తగినంత నిద్ర లేకపోవడంతో అనర్థాలు
  • పని, వ్యక్తిగత జీవతం బ్యాలన్స్ అవసరం
‘అతడు చాలా హార్డ్ వర్కర్’.. పనిలో చాలా కష్టపడతాడు అంటూ మన చుట్టూ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించడం వినే ఉంటారు. విజయం కోసం కృషి చేయాలి. నిబద్ధతతో పని చేయాలి. కష్టించి పనిచేయాలి. కానీ, ఆ కష్టం మన ఆరోగ్యాన్ని త్యాగం చేసేట్టుగా ఉండకూదన్నది నిపుణుల సూచన. విరామం లేని పని షెడ్యూల్, విశ్రాంతి లేని జీవనం మన గుండెపై ఎంతో భారాన్ని మోపుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి జీవన విధానంతో కొంత కాలానికి గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి
పని ఎక్కువైతే సహజంగానే అది ఒత్తిడికి దారితీస్తుంది. పరిమిత పనిలో ఒత్తిడి తక్కువ. కానీ, క్లిష్టమైన టాస్క్ లను, ఎక్కువ సమయం చేయాల్సి వచ్చినప్పుడు అది ఒత్తిడికి దారితీస్తుంది. ఇలా ఒత్తిడి పెరిగిపోవడం గుండెకు మంచి చేయదు. స్ట్రెస్ హార్మోన్లు (కార్టిసోల్, అడ్రెనలిన్) విడుదల అవుతాయి. ఈ హార్మోన్ల ప్రభావానికి ఎక్కువ కాలం పాటు గురైనప్పుడు అది రక్తపోటు (బీపీ/హైపర్ టెన్షన్), హానికారక కొలెస్ట్రాల్ పెరిగేందుకు దారితీస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ ఈ రెండూ గుండెకు శత్రువులు.

శారీరక శ్రమ లేమి
మానసికంగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుందేమో కానీ, అది ఒత్తిడితోపాటు ఇతర ఎన్నో దుష్ప్రభావాలకు దారితీస్తుంది. శారీరక శ్రమ ఎన్నో రకాల అనారోగ్య రిస్క్ లను దూరం చేస్తుంది. శారీరక వ్యాయామాలు, చురుకైన జీవనం అన్నవి గుండె ఆరోగ్యానికి మంచివి. పెద్దగా కదలికల్లేని నిశ్చల జీవనం, బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తాయి. జీవనశైలి కారణంగా నేడు కేన్సర్ మహమ్మారి కూడా వస్తోంది.

అధికంగా తినడం
ఒత్తిడి అధిక ఆహార సేవనానికి దారితీస్తుంది. విశ్రాంతి లేమి మన ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి హాని కలిగించే వాటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది కూడా గుండెకు చేటు చేసేదే.

నిద్రలేమి
పగలనకుండా, రాత్రనకుండా కష్టపడితే, మరి నిద్ర సంగతి? శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వకపోతే, జీవక్రియల మరమ్మతులు ఎలా జరుగుతాయి? అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెబుతున్న దాని ప్రకారం.. రాత్రి నిద్ర 7 గంటల కంటే తక్కువగా ఉండే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వచ్చే సమస్యల్లో గుండె జబ్బులు, ఆస్తమా, డిప్రెషన్ ప్రధానంగా ఉంటున్నాయి.

వ్యక్తిగత జీవితంపై ప్రభావం
అస్తమానం పనిలో మునిగిపోయే వారు వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా ఆస్వాదించలేరు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కని కుటుంబం, స్నేహ, సామాజిక సంబంధాలు కూడా అవసరమని ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దీనికితోడు పనితో బిజీగా ఉండే వారు ముందస్తు వైద్య పరీక్షల విషయంలోనూ నిర్లక్ష్యం చూపుతుంటారు. అందుకే పనితోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన.


More Telugu News