చంద్రబాబు గురించి గొప్పగా చెప్పిన ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త కన్వల్ రేఖి

  • స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ
  • చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు
  • చంద్రబాబు నికార్సయిన వ్యక్తి అంటూ కన్వల్ రేఖి పోస్టు
  • నాయుళ్లు కొందరుంటారు కానీ చంద్రబాబునాయుడు ఒక్కడేనని కితాబు
ప్రముఖ ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త కన్వల్ రేఖీ టీడీపీ అధినేత చంద్రబాబు గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. చంద్రబాబు దార్శనికత గురించి కన్వల్ రేఖి తన పోస్టులో ఎంతో ఉన్నతంగా వివరించారు. 

"చంద్రబాబు నికార్సయిన వ్యక్తి. సరైన సమయంలో వచ్చిన సరైన నేత. బిజినెస్ స్కూల్ అంటూ స్థాపిస్తే అందులో సగం సీట్లు స్థానికులకే ఇవ్వాలంటూ మహారాష్ట్రలో శివసేన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఆయన ఐఎస్ బీని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు నాకు హైదరాబాదులోని ఓ బంజరు భూమిని చూపించారు. అక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టనున్నట్టు నాతో చెప్పారు. దాంతో నేను తప్పకుండా కట్టండి అన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. హైటెక్ సిటీ ఏకంగా హైదరాబాద్ నగరం తలరాతనే మార్చేసింది. 

ఇక చంద్రబాబుతో హైదరాబాదులో ఆయన నివాసంలో అర్ధరాత్రి వేళ టీఐఈ బృందంతో కలిసి సమావేశమవడం మరువలేనిది. అసలేం జరిగిందంటే.... అప్పుడు మేం హైదరాబాదుకు వచ్చాం. ఆ సాయంత్రమే ఢిల్లీ వెళ్లాలి. మరుసటి రోజు ఢిల్లీలో అమెరికా అంబాసిడర్ తో విందులో పాల్గొనాల్సి ఉంది. ఆ సమయంలో చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. మాకు ఫోన్ చేసి మరొక్క రోజు హైదరాబాదులో ఉండగలరా? అని అడిగారు. దాంతో మేం ఢిల్లీలో అమెరికా అంబాసిడర్ తో విందు గురించి చెప్పాం. 

అప్పుడాయన సాయంత్రం ఫ్లైట్ కు కాకుండా మార్నింగ్ ఫ్లైట్ కు వెళ్లాలని మమ్మల్ని కోరారు. ఆయన అభ్యర్థనకు మేం సరేనన్నాం. దాంతో, వెంటనే దుబాయ్ నుంచి బయల్దేరి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు అప్పటికప్పుడు తన మంత్రివర్గం మొత్తాన్ని, ఉన్నతాధికారులను తన ఇంట్లో సమావేశపరిచారు. మేం ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడు సమయం వేకువజామున 4 గంటలు. 

ఆ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మాకు ఎయిర్ పోర్టు వరకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. దాంతో మేం సకాలంలో విమానం అందుకోగలిగాం. భారత్ లో కొందరు నాయుళ్లను చూస్తుంటాం కానీ చంద్రబాబునాయుడు లాంటి కచ్చితమైన వ్యక్తిని ఎప్పటికీ చూడబోం" అని కన్వల్ రేఖి వివరించారు.


More Telugu News