ప్రపంచంలో అత్యంత మంట పుట్టించే మిరపకాయ ఇదే..!

  • అత్యంత కారం, వేడిని పుట్టించే పెప్పర్ ఎక్స్
  • గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
  • 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్ల నమోదు
  • తిన్న తర్వాత మూడున్నర గంటల పాటు మంట
ప్రపంచంలో అత్యంత కారంతో కూడిన మిరపకాయగా కొత్త రకం తెరపైకి వచ్చింది. పెప్పర్ ఎక్స్ పేరుతో వింత ఆకారంలో ఉండే ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న కరోలినా రీపర్ రకాన్ని వెనక్కి నెట్టేసింది. పెప్పర్ ఎక్స్ 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లను నమోదు చేసింది. కరోలినా రీపర్ రకం మిరపలో స్కోవిల్లూ హీట్ యూనిట్లు 1.64 మిలియన్ యూనిట్లుగా కావడం గమనించొచ్చు. 

స్కోవిల్లే హీట్ యూనిట్ అనేది మిరపలో ఉండే కారానికి సంబంధించి కొలమానం. ఇది ఎన్ని ఎక్కువ యూనిట్లు ఉండే ఆ మిరప అంతగా మంట, వేడిని పుట్టిస్తుందని అర్థం. పెప్పర్ ఎక్స్ అనే మిరప రకాన్ని ఎడ్ కర్రీ అనే వ్యక్తి పదేళ్లకు పైగా కష్టపడి ఆవిష్కరించారు. దీనిపై ఆయన పేటెంట్ కూడా పొందారు. దీన్ని తిన్న తర్వాత మూడున్నర గంటల పాటు వేడి (మంట) తగ్గలేదని కర్రీ తెలిపారు. పెప్పర్ ఎక్స్ కోసం ఇన్నేళ్ల పాటు శ్రమించిన తన కుటుంబం, పనివారు దీన్నుంచి ప్రయోజనం పొందాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే దీని విత్తనాలను విక్రయిస్తామని ప్రకటించారు. 


More Telugu News