భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్
- తమ ఆటగాళ్ల పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు
- పాక్ జర్నలిస్టులకు వీసాల జారీలో జాప్యంపై నిరసన
- పాకిస్థాన్ అభిమానులకు వీసాలు జారీ చేయకపోవడంపై అసంతృప్తి
వన్డే ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమి అనంతరం పాకిస్థాన్ జట్టు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు కోచ్, టీమ్ డైరెక్టర్ వన్డే ప్రపంచకప్ నిర్వహణ పట్ల విమర్శలు కురిపించారు. ఇది ఐసీసీ టోర్నమెంట్ మాదిరిగా లేదని, బీసీసీఐ ఈవెంట్ లా ఉందంటూ పాక్ టీమ్ డైరెక్టర్ మైక్ ఆర్థర్ విమర్శించడం తెలిసిందే. ఈ నెల 14న అహ్మదాబాద్ లో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ మ్యూజిక్ ను ప్లే చేయలేదని, పాక్ నుంచి రావాలనుకునే అభిమానులకు వీసాలు మంజూరు చేయలేదన్న ఆరోపణలు కురిపించారు. ఆరంభంలో ఇలాంటివి సహజమేనంటూ దీనికి ఐసీసీ కౌంటర్ ఇచ్చింది.
తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అహ్మదాబాద్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా.. పాకిస్థాన్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. తమ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రేక్షకులు అనుచితంగా ప్రవర్తించినట్టు పేర్కొంది. అదే విధంగా పాకిస్థానీ జర్నలిస్టులకు వీసాల జారీలో జాప్యం నెలకొనడం, పాక్ అభిమానులకు వీసాలను జారీ చేయకపోవడం పట్ల ఐసీసీ వద్ద పీసీబీ అధికారికంగా నిరసన తెలిపింది.