సచిన్ కంటే ఇతనే గొప్ప వన్డే బ్యాట్స్ మెన్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా

  • వన్డేల్లో కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మెన్ అన్న ఉస్మాన్ ఖవాజా
  • వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడని వ్యాఖ్య
  • కోహ్లీ నిలకడైన ఆటను చూస్తే ముచ్చటేస్తుందన్న ఖవాజా
వన్డే ఫార్మాట్ లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో సచిన్ చేసిన 49 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ అవకాశం ఉందని చెప్పాడు. వన్డేల్లో కోహ్లీ గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నాడు. సచిన్ కంటే కోహ్లీ తక్కువ వన్డేలు ఆడాడని చెప్పాడు. తన చిన్నప్పుడు సచిన్ వన్డేల్లో ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశాడని... ఆ మార్క్ ను కోహ్లీ తప్ప మరెవరూ అందుకోలేకపోయారని తెలిపాడు. 

ప్రస్తుతం కోహ్లీ కూడా తనకంటూ ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంటున్నాడని చెప్పాడు. కోహ్లీ నిలకడైన ఆటను చూస్తే ముచ్చటేస్తుందని అన్నాడు. ఇంత సుదీర్ఘ కాలం పాటు నిలకడైన ప్రదర్శనను ఇవ్వడం ఆషామాషీ కాదని చెప్పాడు. వన్డేలో గ్రేట్ రన్ ఛేజర్ కోహ్లీ అని కితాబునిచ్చాడు. కోహ్లీ సిక్సులు బాదాల్సిన అవసరం లేదని... అతను తీసే డబుల్స్, కొట్టే ఫోర్లు చూడముచ్చటగా ఉంటాయని చెప్పాడు. తన ఆటతో తనతో ఉన్న ఆటగాళ్లను ప్రభావితం చేసే శక్తి కోహ్లీకి ఉందని అన్నాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండాలని నిశ్చయించుకునే టీమ్ లోకి వచ్చాడని చెప్పాడు. తనకు తెలిసినంత వరకు ప్రతి ఆటగాడు కోహ్లీతో కలిసి ఆడాలని కోరుకుంటాడని తెలిపాడు.


More Telugu News