నేను చెబుతున్నాను... తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం: విజయసాయిరెడ్డి

  • త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు
  • తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓడిపోతుందన్న విజయసాయి
  • ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నటికీ క్షమించబోరని వెల్లడి
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను చెబుతున్నాను... తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయం అని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడలేదని విమర్శించారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ చూడనంత చెత్త పరిపాలన చేస్తోందని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నానా బాధలు పడుతున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయని వెల్లడించారు.

ఇక, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు నిధులు సమకూర్చే పనిలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం తలమునకలుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పరిపాలనలో మధ్యప్రదేశ్ ఎప్పుడూ ఓ వెనుకబడిన రాష్ట్రంగానే ఉండేదని ఆరోపించారు. 

కాంగ్రెస్ చేసిన కుంభకోణాలు, మోసాలు, అసమర్థ పాలన దేశ ప్రజలందరికీ తెలుసని విజయసాయి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఓ పార్టీగా ప్రజల్లో ఎప్పుడో నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు. 

పూర్తి అశాస్త్రీయంగా ఏపీని విభజించినందుకు ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నటికీ క్షమించబోరని ఉద్ఘాటించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలు కనాల్సిందే తప్ప, అది జరగని పని అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News