ఇక ప్రతి క్రికెటర్ ఒలింపిక్ స్వర్ణం కోసం కలలు కనొచ్చు: మిథాలీ రాజ్

  • 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
  • ఐఓసీ సమావేశంలో క్రికెట్ కు మెజారిటీ సభ్యుల ఓట్లు
  • హర్షం వ్యక్తం చేసిన మిథాలీ
ఒలింపిక్స్ లో క్రికెట్ కు స్థానం కల్పిస్తూ ఐఓసీ కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నిర్ణయానికి ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలపడంతో పాటు, ముంబయిలో ఐఓసీ సమావేశంలో చేపట్టిన ఓటింగ్ లోనూ మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. దాంతో 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం ఆతిథ్యమిచ్చే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. 

దీనిపై భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ స్పందించారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 ద్వారా క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్ లో ప్రవేశిస్తుండడం ఎంతో ఉద్విగ్నత కలిగిస్తోందని తెలిపారు. ఇకపై ప్రతి క్రికెటర్ ఒలింపిక్ స్వర్ణం గురించి కలలు కనొచ్చని, ప్రపంచ అత్యున్నత క్రీడా వేదికపై పతకం అందుకుని సగర్వంగా తమ జాతీయ గీతం పాడుకోవచ్చని మిథాలీ పేర్కొన్నారు. 

"ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న ప్రతిపాదన చేసిన ఐసీసీ కమిటీలో నేను కూడా భాగం కావడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తోంది. వ్యక్తిగతంగా విజయం సాధించినంత సంబరంగా ఉంది" అని మిథాలీ వివరించారు.


More Telugu News