లంచం తీసుకుని లోక్ సభలో ఎంపీ మహువా ప్రశ్నలు.. ఎథిక్స్ కమిటీ ముందుకు ఫిర్యాదు

  • వ్యాపార వేత్త హీరానందానీ తరఫున మహువా ప్రశ్నలు వేసినట్టు ఆరోపణలు
  • తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
  • ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్ర లంచం తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు వేశారంటూ వచ్చిన ఫిర్యాదును ఎథిక్స్ కమిటీకి స్పీకర్ ఓంబిర్లా పంపించారు. మోయిత్రపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు. లంచం తీసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని తరఫున అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మోయిత్ర ఆరోపణలు చేశారంటూ లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులో దూబే పేర్కొన్నారు.

తృణమూల్ ఎంపీ తన చర్య ద్వారా పార్లమెంట్ గౌరవానికి, సభా ధిక్కరణకు, నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు దూబే ఆరోపించారు. హీరానందానీ గ్రూప్ ఎనర్జీ, ఇన్ ఫ్రా కాంట్రాక్టులను అదానీ గ్రూప్ నకు కోల్పోయిందని, దీంతో అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా హీరానందానీ గ్రూప్ మోయిత్రతో ఆరోపణలు చేయించిందన్నది దూబే పేర్కొన్న వాదనగా ఉంది. కాకపోతే ఈ ఆరోపణలను హీరానందానీ గ్రూప్ ఖండించింది. వ్యాపారం కోసమే వ్యాపారంలో ఉన్నామే తప్పించి, రాజకీయ వ్యాపారం తమది కాదని పేర్కొంది. తమ గ్రూప్ జాతి ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలసి పనిచేస్తుందని తెలిపింది. 

తన తరఫున మోయిత్ర ప్రశ్నించినందుకు గాను, ఆమెకు రూ.2 కోట్ల చెక్, ఖరీదైన ఐఫోన్ వంటివి హీరానందానీ బహుమతులుగా ఇచ్చినట్టు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఎన్నికల్లో పోటీకి వీలుగా మోయిత్రకు రూ.75 లక్షల చెక్ కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. 2019 నుంచి 2023 మధ్య తృణమూల్ ఎంపీ మోయిత్ర లోక్ సభలో 61 ప్రశ్నలు వేయగా, అందులో 50 ప్రశ్నలను హీరానందానీ కోసమే సంధించినట్టు దూబే ఆరోపించారు. మోయిత్ర తన లోక్ సభ లాగిన్ వివరాలను చట్టవిరుద్ధంగా హీరానందానీతో పంచుకున్నారని కూడా పేర్కొన్నారు. ఈ లాగిన్ తో హీరా నందానీ నేరుగా ప్రశ్నలు పోస్ట్ చేసి ఉండొచ్చన్నారు.


More Telugu News