సీఐడీ కేసుపై ఏపీ హైకోర్టులో రామోజీరావు, శైలజా క్వాష్ పిటిషన్.. రేపటికి విచారణ వాయిదా
- మార్గదర్శిలో వాటాలను ఫోర్జరీతో బదిలీ చేసుకున్నట్టు యూరిరెడ్డి ఆరోపణలు
- దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ పోలీసులు
- రేపటి వరకు రామోజీరావుపై కఠిన చర్యలు తీసుకోబోమన్న సీఐడీ
మార్గదర్శిలో వాటాలకు సంబంధించిన వివాదంలో సీఐడీ దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి మార్గదర్శిలో తన పేరిట ఉన్న వాటాలను ఫోర్జరీ సంతకాలతో శైలజ పేరు మీదకు మార్చుకున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో రామోజీరావును ఏ1గా, శైలజా కిరణ్ ను ఏ2గా పేర్కొంటూ సీఐడీ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రామోజీరావు, శైలజాకిరణ్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. రామోజీరావు, శైలజా కిరణ్ తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రేపటి వరకు ఈ కేసులో రామోజీరావుపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సీఐడీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో బుధవారం వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.
1962లో మార్గదర్శి స్థాపించిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5,000 పెట్టుబడిగా పెట్టగా, 288 షేర్లు లభించాయన్నది యూరిరెడ్డి వాదనగా ఉంది. తన తండ్రి 1985లో చనిపోయారని, తన తండ్రికి మార్గదర్శిలో వాటాలున్నట్టు తెలిసి, అడిగేందుకు సోదరుడు మార్టిన్ రెడ్డితో వెళ్లగా, రామోజీరావు తుపాకీతో బెదిరించి తమ నుంచి బలవంతంగా వాటాలు రాయించుకున్నట్టు, ఈ వాటాలు 2016లో శైలజాకిరణ్ పేరిట బదిలీ అయినట్టు ఆరోపిస్తున్నారు.