బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే గుడ్ బై?
- టీపీసీసీ చీఫ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే బాపూరావు
- బోధ్ స్థానం నుంచి పోటీ చేసే యోచన
- బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాలు
ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆ పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకు సంకేతంగా పీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో బాపూరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని మాట్లాడడంతో పార్టీ మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భోధ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాపూరావుకు ఈ విడత బీఆర్ఎస్ మొండి చేయి ఇచ్చింది. బాపూరావుకి కాదని, అనిల్ జాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బాపూరావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
బోధ్ సహా మొత్తం ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులు రంగంలోకి దింపనుండడం తెలిసిందే. ఇప్పటికే రేఖా నాయక్ (ఖానాపూర్) టికెట్ ఇవ్వలేదన్న కోపంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడారు. బీఆర్ఎస్ వైఖరిపై గుర్రుగా ఉన్న బాపూరావు రేవంత్ రెడ్డిని కలసి బోధ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంపై చర్చించినట్టు సమాచారం. టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభయం వస్తే బాపూరావు పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.