స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా ఈ కశ్మీర్ దేవాలయంలో పూజలు!

  • కుప్వారా జిల్లాలోని శారదా మాత దేవాలయంలో 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ
  • సోమవారం కన్నులపండువగా సాగిన కార్యక్రమం
  • దేవాలయ పునరుద్ధరణలో హోం మంత్రి అమిత్ షా కీలకపాత్ర
  • మార్చి 23న నూతన దేవాలయాన్ని పునఃప్రారంభించిన షా
  • పూజాకార్యక్రమం వీడియో షేర్ చేసిన తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుప్వారా జిల్లా టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు. సరిహద్దుకు సమీపాన ఉన్న ఈ దేవాలయంలో పూజలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ దేవాలయ పునరుద్ధరణలో హోం మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. మార్చి 23న ఆయన దేవాలయాన్ని ప్రారంభించారు. కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణ స్థాపనకు ఇది నిదర్శనమని అప్పట్లో షా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కశ్మీర్‌లో ఆధ్యాత్మిక సంస్కృతి పునరుద్ధరణ జరిగిందన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న స్థలంలోనే, అప్పటి డిజైన్ ఆధారంగానే నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

పూజల పునఃప్రారంభంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట పంచుకున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణ జరుగుతోందని వ్యాఖ్యానించారు.


More Telugu News