టీసీఎస్ లో 40,000 మంది ఫ్రెషర్లకు అవకాశం

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తవాళ్లను తీసుకోనున్న టీసీఎస్
  • సీఎఫ్ వో గణపతి సుబ్రమణియన్ ప్రకటన
  • గత రెండేళ్లలో ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నట్టు వెల్లడి
  • అటు, ఈ ఏడాది ఫ్రెషర్ల నియామకాలు లేవన్న ఇన్ఫోసిస్
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న పరిస్థితుల్లోనూ ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ పెద్ద ఎత్తున ఫ్రెషర్లకు అవకాశాలు కల్పించనుంది. మరో ప్రముఖ కంపెనీ ఇన్ఫోసిస్ తాము క్యాంపస్ రిక్రూట్ మెంట్లు చేపట్టబోవడంలేదని స్పష్టం చేయగా... టీసీఎస్ సీవోవో ఎన్ గణపతి సుబ్రమణియన్ తాము క్యాంపస్ నుంచి పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు టీసీఎస్ తెలిపింది.

నిజానికి ఈ ఏడాదే అని కాదు... ఏటా 35,000 నుంచి 40,000 మంది ఫ్రెషర్లకు టీసీఎస్ ఉపాధి కల్పిస్తూ వస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగించే ప్రణాళికలు ఏవీ లేవని సుబ్రమణియన్ స్పష్టం చేశారు. 

ఒకవైపు టీసీఎస్ యథావిధిగా క్యాంపస్ నియామకాల పట్ల సానుకూలంగా ఉండగా, మిగిలిన ఐటీ కంపెనీలు భిన్నమైన వైఖరితో వ్యవహరిస్తున్నాయి. ఇటీవలే ఇన్ఫోసిస్ సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ మాట్లాడుతూ.. తాము గత ఏడాది 50,000 మంది ఫ్రెషర్లను తీసుకున్నట్టు చెప్పారు. డిమాండ్ పరిస్థితులు పుంజుకునే వరకు (ఐటీ సేవల కోసం) క్యాంపస్ నియామకాలు చేపట్టేది లేదన్నారు. 

నిజానికి డిమాండ్ పరిస్థితులకు తగ్గట్టుగానే ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలు చేపడుతుంటాయి. టీసీఎస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ, గడిచిన 12-24 నెలల్లో ఉద్యోగుల వలసల రేటు ఎక్కువగా ఉందంటూ, అందుకే సాధారణం కంటే ఎక్కువ మందిని నియమించుకునే యోచనతో ఉన్నట్టు టీసీఎస్ సీవోవో సుబ్రమణియన్ ప్రకటించారు.


More Telugu News