సంచలన నిఠారీ సీరియల్ హత్య కేసుల్లో సింగ్, కోలీలకు విముక్తి

  • ఉరిశిక్షను రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు
  • ఈ కేసులో అన్ని అభియోగాల నుంచి విముక్తి
  • 2006లో నోయిడాలో వెలుగు చూసిన చిన్నారుల అస్తిపంజరాలు
సంచలనం సృష్టించిన 2006 నాటి చిన్నారుల సీరియల్ హత్యల కేసులో నిందితులుగా ఉన్న సురీందర్ కోలి, మోనిందర్ సింగ్ పంథేర్ ను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. ఈ అభియోగాల నుంచి వారికి విముక్తి కల్పించింది. 

నిఠారీ సీరియల్ హత్య కేసులుగా పేరుగాంచిన ఈ వ్యవహారంలో... రెండు కేసుల్లో మోనిందర్ సింగ్ కు ఉరిశిక్ష పడగా, అతడు హైకోర్టులో సవాలు చేశాడు. అతడిపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా, ఇంతకుముందే నాలుగు కేసుల్లో విముక్తి లభించింది. ఇప్పుడు అతడిపై ఉరిశిక్షకు సంబంధించిన రెండు కేసుల్లోనూ హైకోర్టు నుంచి ఉపశమనం దక్కింది. 

సురీందర్ కోలిపై అన్ని కేసుల్లోనూ అభియోగాలను కోర్టు కొట్టివేసింది. దీంతో జైలు నుంచి విడుదలకు మార్గం సుగమం అయింది. 

యూపీలోని నోయిడాలో చిన్నారుల హత్యలకు సంబంధించి కేసులో మోనిందర్ సింగ్ పంథేర్, అతడి సహాయకుడు సురీందర్ కోలి 2006 డిసెంబర్ 29న అరెస్ట్ అయ్యారు.  తప్పిపోయిన చిన్నారుల అస్తిపంజరాలు మోనిందర్ సింగ్ ఇంటి సమీప కాలువలో కనిపించాయి. మోనిందర్ చిన్నారులపై అత్యాచారం చేసి, హత్య చేసి పడేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడికి దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది. 

అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే రేపింది. చిన్నారులపై అమానవీయంగా అత్యాచారం చేసినట్టు, హత్య చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కానీ, దీనికి సంబంధించి తగిన సాక్ష్యాలను సంపాదించడంలో పోలీసులు విఫలమైనట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ నాడు అదృశ్యమైన, అస్తిపంజరాలుగా తేలిన చిన్నారుల మరణం వెనుక అసలు ఎవరు ఉన్నారన్నది ఇప్పటికీ తేలని విషయంగానే మిగిలిపోయింది.


More Telugu News