పార్టీలు తమ అభ్యర్థులకు ఇచ్చే బీ ఫామ్ అంటే..!

  • పార్టీ అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే పత్రమే బీ ఫామ్
  • ఈ పత్రం ఇస్తేనే పార్టీ గుర్తింపు చిహ్నం కేటాయింపు
  • బీ ఫామ్ అందించే అర్హత కల్పిస్తూ ఇచ్చేది ‘ఏ’ ఫామ్
ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల తరఫున బరిలోకి దిగే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటూ బీ ఫామ్ సమర్పిస్తుంటారు. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు ఈ ఫామ్ ను అందిస్తుంటాయి. ఇంతకీ ఈ బీ ఫామ్ అంటే ఏంటి.. దీనికి అంత విలువ ఎందుకనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది. అభ్యర్థి నిర్ధారణ కోసం బీ ఫామ్ జారీ చేస్తుంది. ఈ ఫామ్ లో పేర్కొన్న అభ్యర్థిని తమ అభ్యర్థిగా గుర్తించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తుంది. నామినేషన్ పత్రాలకు బీ ఫామ్ జతచేసిన అభ్యర్థిని సంబంధిత పార్టీ అభ్యర్థిగా అధికారులు గుర్తిస్తారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తును ఈ అభ్యర్థికి కేటాయిస్తారు. బీ ఫామ్ లేకుంటే పార్టీ గుర్తును కేటాయించరు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ గుర్తులను కేటాయించకపోవడం తెలిసిందే.

ఇక, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫామ్ అందించే అధికారం ఎవరికి ఉందనే విషయాన్ని తెలియజేసేదే ‘ఏ’ ఫామ్.. పార్టీ తరఫున బీ ఫామ్ ల జారీకి అధికారం కల్పిస్తూ పార్టీ అధినేత ఈ ఫామ్ ను జారీ చేస్తారు. ఈ ఫామ్ లో పేర్కొన్న నేత దానిని ఎన్నికల కమిషన్ కు అందజేస్తారు. అనంతరం ‘ఏ’ ఫామ్ లో పేర్కొన్న నేత సంతకంతో జారీ చేసిన బీ ఫామ్ లకు మాత్రమే ఎన్నికల అధికారులు ఆమోదం తెలుపుతారు.


More Telugu News