కేసీఆర్‌తో దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి: హిమాన్షూ రావు

  • సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సమ్మిళిత అభివృద్ధి సాధించిందని పోస్ట్
  • తరతరాలుగా వేధిస్తున్న సమస్యలు బీఆర్‌ఎస్ పాలనలో కనుమరుగయ్యాయని వ్యాఖ్య
  • ‘దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి’ నినాదం కేసీఆర్ పాలనకు సరైన నిర్వచనమని వెల్లడి
  • అందుకే అందరూ ‘కారు రావాలి, కేసీఆర్ గెలవాలి’ అని నినదిస్తున్నారన్న హిమాన్షూ
తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షూ తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు. ‘ఒక దశాబ్ది కాలంలోనే శతాబ్ది అభివృద్ధి’ అన్న నినాదం సీఎం కేసీఆర్ పాలనకు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పారదర్శకమైన, సమర్థవంతమైన, ప్రభావశీలమైన పాలన సాగుతోందని హిమాన్షూ చెప్పారు. అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి, సామాజిక అభ్యున్నతి చోటుచేసుకుందని పేర్కొన్నారు. 

తెలంగాణలో తరతరాలుగా వేధిస్తున్న సమస్యలు కేసీఆర్ మోడల్ పాలనతో అంతరించిపోయాయని చెప్పారు. నల్గొండలో ఫ్లోరోసిస్, పాలమూరులో ఆకలి వలసలు, విద్యుత్ సంక్షోభంతో రైతుల ఆత్మహత్యలు, తాగు నీటి-సాగునీటి కొరత, అణగారిన వర్గాలపై వివక్ష, హైదరాబాద్‌లో అల్లర్లు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, శిశు-మాతా మరణాలు వంటివన్నీ కనుమరుగయ్యాయని హిమాన్షూ గుర్తు చేశారు. నాణ్యమైన, విద్య వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇంకా ఎన్నో అంశాల్లో తెలంగాణ అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని ప్రశంసించారు. ఫలితంగా ఇప్పుడు అందరూ ‘కార్ రావాలి.. కేసీఆర్ గెలవాలి’ అని నినదిస్తున్నారని చెప్పారు.


More Telugu News