చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయకండి: సీఎం కేసీఆర్

  • నోరు అదుపులో పెట్టుకోవాలంటూ అభ్యర్థులకు వార్నింగ్
  • అహంకారం వల్లే గతంలో జూపల్లి ఓడిపోయారన్న కేసీఆర్
  • అలకలు పక్కన పెట్టాలంటూ అభ్యర్థులకు క్లాస్ తీసుకున్న బీఆర్ఎస్ చీఫ్
ఎన్నికల ముందు చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయొద్దంటూ బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు. ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో ఆదివారం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ చీఫ్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని సూచించారు. తలబిరుసుతనంతో వ్యవహరిస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు. గతంలో అహంకారం ప్రదర్శించడం వల్లే జూపల్లి ఓటమి పాలయ్యారని చెప్పారు.

ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. అలకలు పక్కన పెట్టి అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్ ను సమన్వయకర్తగా నియమించినట్లు కేసీఆర్ చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే  98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేయాలని.. భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారని అభ్యర్థులకు సూచించారు.

జూపల్లి కృష్ణారావు ఉదంతాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జూప‌ల్లి కృష్ణారావు అని ఒకాయ‌న ఉండే.. మంత్రిగా కూడా ప‌ని చేశారు. అయినా అహంకారంతో వ్యవహరించారు. ఇత‌ర నాయ‌కుల‌తో మాట్లాడ‌లేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. ఒక మ‌నిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగ‌తంగా మనవి చేస్తున్నానంటూ.. ఈ ముఖ్యమైన సమయంలో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు.



More Telugu News