హమాస్ దాడి నా తప్పే.. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు విచారం

  • అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి
  • ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ వైఫల్యంపై విమర్శల వెల్లువ
  • దాడిని ముందుగా పసిగట్టలేకపోవడం తన తప్పేనన్న ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు
ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7న జరిపిన ఆకస్మిక దాడి యావత్ ప్రపంచాన్నీ నివ్వెరపరిచింది. ప్రపంచఖ్యాతి గాంచిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాడ్ ఈ విపత్తును ముందుగా ఎందుకు గుర్తించలేకపోయిందీ? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతాసలహాదారు చేచి హనెగ్‌బీ స్పందించారు. దాడుల్ని ముందుగా పసిగట్టలేకపోవడం తమ తప్పేనని విచారం వ్యక్తం చేశారు. 

‘‘ఇది నా తప్పు దీని వల్ల ఇంటెలిజెన్స్ అంచనాలు కూడా తప్పాయి. 2021లో జరిగిన యుద్ధంతో హమాస్ గుణపాఠం నేర్చుకుని ఉంటుందని భావించాం. కానీ, అలా జరగలేదు. మళ్లీ దాడులకు దిగింది. ఇప్పుడు ఎలాంటి సంప్రదింపులు ఉండవు. వాళ్లని అంతమొందించేవరకూ యుద్ధం చేస్తాం’’ అని హనెగ్‌బీ పేర్కొన్నారు. 

కాగా, ఇప్పటివరకూ గగనతల దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి కూడా సిద్ధమైంది. ఆర్మీని నేరుగా గాజాలోకి పంపించి ఉగ్రవాదుల ఏరివేతకు పూనుకుంది.


More Telugu News