లులు మాల్‌లో పాకిస్థాన్ జెండా అంశం... కర్ణాటకలో బీజేపీ మహిళా నేతపై కేసు

  • లులు మాల్‌లో పాకిస్థాన్ జెండా పెద్దదిగా ఉందంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిన వైనం
  • డీకే శివకుమార్‌కు ట్యాగ్ చేసిన బీజేపీ నేత
  • పాకిస్థాన్ జెండాను ఫోకస్ చేసి ఫోటో తీయడంతో పెద్దగా కనిపించినట్లు విచారణలో వెల్లడి
లులు మాల్‌లో పాకిస్థాన్ జెండా పెద్దదిగా ఉందంటూ జరిగిన ప్రచారానికి సంబంధించిన అంశంలో ఓ బీజేపీ నేతపై కేసు నమోదయింది. కేరళలోని కొచ్చి లులు మాల్‌లో భారత్, పాక్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన జెండాలను ప్రదర్శించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ నేత శకుంతల... ఈ మాల్‌లో జెండాల అమరిక విషయంలో ఆరోపణలు చేశారు. లులు మాల్‌లో ఇతర దేశాల జెండా కంటే పాకిస్థాన్ జెండా పెద్దదిగా ఉన్నట్లు ఆరోపణలు గుప్పించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

కొచ్చి లులు మాల్‌ను కర్ణాటకలోనిదిగా భావిస్తూ ఆమె ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ట్యాగ్ చేశారు. దీంతో బెంగళూరు మేనేజర్‌ను కంపెనీ ఉద్యోగం నుంచి తీసేసింది. అయితే విచారణలో ఇక్కడ పాకిస్థాన్ జెండాను ఫోకస్ చేసి తీయడంతో ఫోటోలో పెద్దగా కనిపించిందని, మిగతావి చిన్నవిగా కనిపించినట్లు వెల్లడైంది. దీంతో ఫేక్ ఫోటో షేర్ చేసినందుకు కర్ణాటక పోలీసులు బీజేపీ నేతపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై మాజీ మేనేజర్ అతిరా లింక్డిన్‌లో పోస్ట్ చేసి, అకారణంగా తనను పోస్ట్ నుంచి తీసేశారని వాపోయారు. అయితే విచారణ తర్వాత తనను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు.


More Telugu News