మీకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు!: ఎంసెట్ కౌన్సిలింగ్ పై సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ

  • మీ రివర్స్ పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయంటూ విమర్శ
  • మూడో విడత కౌన్సిలింగ్ రద్దు చేసి విద్యార్థులకు తీరని ద్రోహం చేశారని ఆవేదన
  • రాష్ట్రంలోని పిల్లలకు మేనమామను అంటావ్.. తండ్రి మనసుతో ఆలోచించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ తక్షణమే నిర్వహించి వేలాదిమంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఈ లేఖ రాశారు. మీ రివర్స్ పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయని, ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లాయని, ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మీకు అలవాటైన రివర్స్‌లో చేస్తూ వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరం చేశారని పేర్కొన్నారు. పద్ధతిగా జరగాల్సిన మూడో విడత కౌన్సిలింగ్ రద్దు చేసి విద్యార్థులకు తీరని ద్రోహం చేశారన్నారు.

మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు... రాష్ట్రంలోని పిల్లలకు మేనమామను అంటావు... కనీసం తండ్రి మనసుతో ఆలోచించండి. మంచి బ్రాంచీలో ఇంజినీరింగ్ చేయాలనే కలలు కల్లలైన పిల్లలు చేతులు కోసుకుంటూ, రక్తాలతో రాస్తున్న లేఖలు చూసైనా మనసు కరగడం లేదా? అని ప్రశ్నించారు. మూడో విడత కౌన్సిలింగ్‌లో తమకు దగ్గరున్న బ్రాంచీలో వస్తుందని భావించిన విద్యార్థులు నీ రివర్స్ దెబ్బకి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు జగన్‌కు లోకేశ్ రెండు పేజీల లేఖ రాశారు. ఆ తర్వాత ఈ లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ప్ర‌తి ఏటా ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రిగే ఎంసెట్ 3వ విడ‌త కౌన్సెలింగ్ ఏపీ స‌ర్కారు ర‌ద్దు చేయ‌డంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని, త‌క్ష‌ణ‌మే కౌన్సెలింగ్ నిర్వ‌హించాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌మకు ద‌గ్గ‌ర‌లో, కోరుకున్న బ్రాంచి వ‌స్తుంద‌ని నిరీక్షిస్తున్న విద్యార్థుల‌కు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కౌన్సెలింగ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని హామీ ఇచ్చి మోస‌గించారని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఎగ‌వేసి, సీట్లు అమ్ముకునేందుకే 3వ విడ‌త కౌన్సెలింగ్ ర‌ద్దుచేసి స్పాట్ అడ్మిష‌న్ల‌కి తెర‌లేపారని ఆరోపించారు. 3వ విడ‌త కౌన్సెలింగ్ ర‌ద్దుతో విద్యార్థులు పాల్ప‌డుతున్న ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల‌కు స‌ర్కారుదే బాధ్య‌త‌ అన్నారు. త‌క్ష‌ణ‌మే ఎంసెట్ 3వ విడ‌త కౌన్సెలింగ్ ప్ర‌క‌టించి విద్యార్థుల‌కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.


More Telugu News