చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరం అని సిఫారసు చేశాం: డాక్టర్ శివకుమార్

  • రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అలర్జీ సమస్యలు
  • నేడు జైల్లోకి వెళ్లిన మరో వైద్య బృందం
  • మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ శివకుమార్
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వ వైద్యులతో కూడిన మరో బృందం నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్లింది. చంద్రబాబును పరీక్షించిన అనంతరం డాక్టర్ శివకుమార్ తో కూడిన వైద్య బృందం మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ మీడియా సమావేశంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, జైల్లోకి వెళ్లి చంద్రబాబుకు పలు వైద్య పరీక్షలు చేశామని చెప్పారు. బీపీ చూశాం, ఆక్సిజన్ శాచ్యురేషన్ పరీక్షించాం, ఊపిరితిత్తుల పనితీరును కూడా పరీక్షించాం అని వెల్లడించారు. చంద్రబాబు పేర్కొంటున్న సమస్యలను మినహాయిస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. మేం చూసొచ్చి మీకు చెబుతున్నాం అని డాక్టర్ శివకుమార్ స్పష్టం చేశారు. 

"ఐదుగురితో కూడిన మా వైద్య బృందం జైల్లోకి వెళ్లి చంద్రబాబును పరిశీలించింది. నీరసం అని ఆయనేమీ చెప్పలేదు. మాతో ఎంతో యాక్టివ్ గా మాట్లాడారు. ఆయన చుట్టూ కూర్చున్న మాతో చక్కగా మాట్లాడారు... మేం అడిగిన ప్రతి అంశానికీ స్పందించారు. ఆయన ఏ ఆహారం తీసుకుంటారు, ఆహార వేళలు అన్నీ అడిగాం... ఆయన కూడా హ్యాపీగా సమాధానం చెప్పారు. 

నీరసంగా ఉన్న వ్యక్తి అయితే బెడ్ పై పడుకుని ఉంటాడు... మేం చంద్రబాబు బీపీ చెక్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాం. మేం చంద్రబాబును పరీక్షించిన దానిపై జైలు అధికారులకు ఓ నివేదిక ఇస్తాం. ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం కనిపించడంలేదు. అయితే, చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరం అని మేం సిఫారసు చేస్తున్నాం. 

ఇవాళ చంద్రబాబు బరువు కూడా చూశాం... ఆయన 67 కిలోల బరువున్నారు. చంద్రబాబుకు ఒంటిపై ర్యాష్ వచ్చింది. ర్యాష్ ఎందుకు వచ్చిందనేదానికి చాలా కారణాలు ఉంటాయి. అన్నీ చెప్పలేం. తగిన చికిత్సను మేం సూచించాం. అయితే చంద్రబాబు తనకు ఓ పాలసీ ఉందన్నారు. తనకు వ్యక్తిగత వైద్యుడు ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన తన పర్సనల్ డాక్టర్ ను సంప్రదించి చికిత్స విధానంపై నిర్ణయం తీసుకుంటారు. 

చంద్రబాబు గత హెల్త్ రిపోర్ట్స్ గురించి మాకేమీ తెలియదు. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల గురించే మేం పరీక్షలు జరిపాం. అయితే, ఆయన జైలుకు వచ్చాక నమోదైన మెడికల్ రికార్డులన్నీ మేం చూశాం. స్థానిక డాక్టర్ ఇచ్చిన ట్రీట్ మెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. మా బృందంలోని ఓ వైద్యురాలు ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చారు. అందులోని అంశాలే బయటికి వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. 

ఇక, చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. చంద్రబాబుకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంలేదని నిజాయతీగా చెబుతున్నాం. మూత్ర విసర్జన సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే, అలాంటివేమీ లేవని చంద్రబాబు చెప్పారు. మిగిలిన వ్యక్తిగత మెడికల్ కంప్లెయింట్స్ ను నేను మీడియా ముందు చెప్పలేను. కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు" అని డాక్టర్ శివకుమార్ వివరించారు.


More Telugu News