ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో సుందర్ పిచాయ్‌కి ఈయూ వార్నింగ్

  • సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ, హింసాత్మక కంటెంట్‌పై తీవ్ర ఆందోళన
  • నిబంధనలకు లోబడి పనిచేయాలని హెచ్చరిక
  • నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని  గూగుల్, యూట్యూబ్ సీఈవోలకు స్పష్టం

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులపై పెద్ద ఎత్తున హింసాత్మక కంటెంట్, న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. వదంతులు, అవాస్తవ కథనాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇందుకు ప్రధాన కారణామవుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో హింసాత్మక కంటెంట్ బెడద యూరోపియన్ యూనియన్‌కు (EU) మరీ ఎక్కువైంది. మైనర్లపై కూడా ఈ కంటెంట్ ప్రభావం పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఈయూ ఇప్పటికే ఎక్స్‌పై (గతంలో ట్విటర్) దర్యాప్తు మొదలుపెట్టగా తాజాగా ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటాను కూడా హెచ్చరించింది. 

హింసాత్మక, అవాస్తవ, గ్రాఫిక్ కంటెంట్ వ్యాప్తికి ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఇతర మాధ్యమాలు కారణమవుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌‌ని ఈయూ హెచ్చరించింది. యూట్యూబ్‌ సహా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌పై చట్టవిరుద్ధ, హింసాత్మక కంటెంట్‌ వ్యాప్తికి సంబంధించి ఈయూ నిబంధనలకు కంపెనీ తప్పకుండా కట్టుబడి ఉండాలని హెచ్చరించింది. యూట్యూబ్ సహా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌పై ఈ తరహా కంటెంట్ వ్యాప్తి చెందుతోందని పిచాయ్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ ఇంటర్నల్ మార్కెట్ కమిషనర్ థియర్రీ బ్రెటన్ సుందర్ పిచాయ్‌కి లేఖ రాశారు. ఈయూ డిజిటల్ సర్వీసెస్ చట్టం ప్రకారం కంటెంట్ తీవ్రతను బట్టి నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయని గుర్తుచేశారు. ఈ నిబంధనల విషయంలో కంపెనీ అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా లోబడి పనిచేయాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌లో హమాస్ భయానక ఉగ్రదాడుల నేపథ్యంలో ఈయూ ఈ విధంగా స్పందించింది. 


నిబంధనలు పాటించకుంటే జరిమానా...

ఇజ్రాయిల్‌లో హమాస్ ఉగ్రవాదుల నేపథ్యంలో చట్టవిరుద్ధమైన హింసాత్మక కంటెంట్ విపరీతంగా పెరిగిపోయినట్టు తాము గుర్తించినట్టు లేఖ ద్వారా సుందర్ పిచాయ్‌కి ఈయూ తెలిపింది. మైనర్ల గోప్యత, భద్రత, రక్షణ విషయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. చట్టవిరుద్ధ కంటెంట్‌కు సంబంధించి నోటీసులు అందిన వెంటనే చర్యలు ప్రారంభించాలని స్పష్టం చేసింది. సంబంధిత కంటెంట్‌ను తొలగించాలని, అత్యవసర పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి ప్రభుత్వాధికారులు, యూరోపోల్‌ను సంప్రదించాలని సూచించింది. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకుంటే విచారణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనలకు లోబడి పనిచేయలేదని తేలితే జరిమానా విధిస్తామని థియర్రీ బ్రెటన్ తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని సుందర్ పిచాయ్‌తో పాటు యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్‌కు కూడా ఈయూ స్పష్టం చేసింది. ‘‘ ఈయూలో మీ ప్లాట్‌ఫామ్స్ ను వినియోగిస్తున్న లక్షలాది మంది పిల్లలు, టీనేజర్లను రక్షించేందుకు కంటెంట్ విషయంలో మీ కంపెనీ నిర్దిష్ట నిబంధనలను పాటించాలి. బంధీలుగా మార్చుతున్నట్టు చిత్రీకరించిన దృశ్యాలు, ఇతర హింసాత్మక గ్రాఫిక్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి’ అని లేఖ ద్వారా తెలియజేశారు.


More Telugu News