హమాస్ ముందు ఆల్‌ఖైదా చిన్నబోయింది: జో బైడెన్
- గాజాలో మానవీయ సంక్షోభానికి తొలి ప్రాధాన్యత అన్న బైడెన్
- అమాయకులు యుద్ధ పర్యవసనాలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య
- ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా సాయం ఉంటుందని పునరుద్ఘాటన
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, లక్షలాది మంది నిరాశ్రయులుగా మారుతున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పందించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్ధతు ఉంటుందని చెబుతూనే.. గాజాలో మానవీయ సంక్షోభాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని పునరుద్ఘాటించారు. మానవీయ సంక్షోభమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. పాలస్తీనియన్లలో అత్యధికులకు హమాస్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ భయంకరమైన దాడులను చవిచూస్తున్నారని గుర్తించామని బైడెన్ అన్నారు. గాజాలో పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమాయకులు యుద్ధ పరిణామాలను ఎదుర్కోవాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫిలడెల్ఫియాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆల్‌ఖైదా చిన్నబోయింది...
ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా సహాయసహకారాలు ఉంటాయని అమెరికా వైఖరిని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లో హమాస్ జరిపిన భయంకరమైన దాడులను నిజమైన రాక్షసరూప దాడులుగా ఆయన అభివర్ణించారు. హమాస్ ముందు ‘ఆల్‌ఖైదా’ చిన్నబోయిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్‌తోపాటు ఇతర అరబ్ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితితో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తమ బృందాలు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. హమాస్ ఉగ్రమూకల చెరలో బంధీలుగా ఉన్న అమెరికన్ల కుటుంబ సభ్యులతో తాను మాట్లాడినట్టు బైడెన్ వివరించారు. తమ ప్రియమైనవారి కోసం వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని వివరించారు. అమెరికన్లను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించానని వెల్లడించారు. ఇజ్రాయెల్‌తోపాటు ఈ ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు వివరించారు.
కాగా.. ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న పాలస్తీనా ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చరిత్రలో చూడని భయానక దాడులు ఉంటాయని, ఆ ప్రాంతాలను ముందే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో గాజాలోని పాలస్తీనియన్లు శనివారం పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కాగా వారం రోజులపాటు కొనసాగిన బాంబు దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, చరిత్రలో చూడని దాడులు ఉండబోతున్నాయని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా హెచ్చరించిన విషయం విధితమే. హమాస్ జరిపిన దాడుల్లో కోల్పోయిన 1300 మంది ప్రాణాలకు ప్రతీకారంగా తరాలపాటు గుర్తుండిపోయే దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అమాయక పాలస్తీనియన్లు 24 గంటల్లో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని హెచ్చరించిన నేపథ్యంలో పిల్లాపాపలతో గాజా నుంచి ప్రజలు తరలివెళ్తున్నారు.