ప్రాక్టీసులో ఉల్లాసంగా, ఉత్సాహంగా శుభ్ మాన్ గిల్... ఫొటోలు ఇవిగో!

  • వరల్డ్ కప్ ఆరంభానికి ముందు డెంగీ బారినపడిన గిల్
  • త్వరగానే కోలుకున్న యువ ఓపెనర్
  • రేపు పాకిస్థాన్ తో టీమిండియా కీలక మ్యాచ్
  • దాయాదితో మ్యాచ్ లో గిల్ బరిలో దిగే అవకాశం
డెంగీ నుంచి కోలుకుని మైదానంలో అడుగుపెట్టిన టీమిండియా యువకెరటం శుభ్ మాన్ గిల్ ప్రాక్టీసులో ఉత్సాహంగా కనిపించాడు. జట్టు సహచరులతో జోకులు వేస్తూ, నవ్వుతూ హుషారుగా కనిపించాడు. పిచ్ ను కూడా పరిశీలించాడు. 

రేపు (అక్టోబరు 14) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  టీమిండియా, పాకిస్థాన్ మధ్య కీలక సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ముమ్మరంగా కసరత్తులు చేశారు. ఈ నెట్  ప్రాక్టీసులో గిల్ కూడా పాల్గొన్నాడు. వరల్డ్ కప్ ఆరంభానికి ముందు గిల్ డెంగీ బారినపడడం తెలిసిందే. ఓ దశలో ప్లేట్ లెట్లు పడిపోవడంతో ఆందోళన నెలకొన్నప్పటికీ, గిల్ త్వరగానే కోలుకుని టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. 

రేపు పాకిస్థాన్ తో అత్యంత కీలక మ్యాచ్ ఉండడంతో గిల్ వంటి ప్రతిభావంతుడైన ఓపెనర్ అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే కొత్తబంతితో పాక్ లెఫ్టార్మ్ సీమర్ షహీన్ అఫ్రిది ఎంతో ప్రమాదకారి. అతడిని పవర్ ప్లే వరకు నిలువరించగలిగితే చాలు... బంతి పాతబడిన తర్వాత మిగతా ఓవర్లలో దూకుడుగా ఆడే వెసులుబాటు ఉంటుంది. 

అటు డిఫెన్స్, ఇటు అఫెన్స్ ఎంతో సమర్థంగా ఆడే గిల్ పాక్ పై భారత లైనప్ కు వెన్నెముకలా నిలవాలని టీమ్ మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. డెంగీ నుంచి కోలుకుని వెంటనే బ్యాట్ పట్టిన గిల్ కూడా జట్టు  తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయరాదన్న పట్టుదలతో నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. గిల్ కష్టపడుతున్న తీరు చూస్తుంటే రేపు అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో పోరుకు అతడు తుది జట్టులో ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది.


More Telugu News