అలా అయితే పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్తాను!: మంత్రి కేటీఆర్

  • పొన్నాల బీఆర్ఎస్‌లో చేరుతామంటే సాదరంగా ఆహ్వానిస్తామన్న మంత్రి కేటీఆర్
  • త్వరలో చాలామంది తమ పార్టీలోకి వస్తారన్న కేటీఆర్
  • అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్‌లో తన్నుకుంటారన్న మంత్రి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తమ పార్టీలో చేరుతామంటే సాదరంగా ఆహ్వానిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ పొన్నాల నేడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ పొన్నాల అంశంపై స్పందించారు. పొన్నాల తమ పార్టీలో చేరుతామంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామన్నారు. త్వరలో చాలామంది ప్రముఖ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.

అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో తన్నుకుంటారన్నారు. ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తారన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లీడర్ అనడం కంటే రీడర్ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి, గుజరాత్ అహంకారానికి పోటీ జరుగుతోందన్నారు. తమపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని, సింగిల్ డిపాజిట్‌కే పరిమితమవుతుందన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి అవగాహన లేదన్నారు.


More Telugu News