మూడు పెళ్లిళ్ల సంగతి వదిలేసి పీఠాధిపతి లెవల్లో సందేశాలు ఇస్తానంటే కుదరదు: పవన్ పై సజ్జల వ్యాఖ్యలు

  • నిన్న సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం
  • పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు
  • మండిపడుతున్న జనసేన నేతలు
  • ఓసారి పబ్లిక్ లోకి వస్తే ఇలాంటివి అడుగుతుంటారన్న సజ్జల 
  • చచ్చినట్టు జవాబివ్వాల్సిందేనని వెల్లడి
సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ఏపీ సీఎం జగన్ జనసేనాని పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దత్తపుత్రుడి ఇంట్లో ఇల్లాలు మూడ్నాలుగేళ్లకు ఓసారి మారిపోతుంటుందని, ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేశారు. మహిళల పట్ల దత్తపుత్రుడికి ఉన్న గౌరవం ఇదీ అంటూ విమర్శించారు. 

అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు మండిపడుతుండగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. నిన్న సీఎం జగన్ అన్నదాంట్లో  ఒక్క చిన్న అబద్ధమైనా ఉందా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నది పవన్ గ్రహించాలని హితవు పలికారు. 

ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చాక ఎవరు ఎవరినైనా ప్రశ్నించవచ్చని అన్నారు. "ఎందుకంటే, అవతలి వ్యక్తి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటాం. సమాజం అంగీకరించని అంశాల్లో అవతలి వ్యక్తి రోల్ మోడల్ గా ఉండకూడదని అనుకుంటాం. ఒకవేళ అలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కొందరు పబ్లిక్ కాకుండా, రహస్యంగా ఉంచుతారు. 

నాయకులు అనే వాళ్లు ఆదర్శప్రాయుల్లా ఉండాలని ఆశిస్తాం. అందుకు భిన్నంగా కనబడినప్పుడు కూడా కొన్నిసార్లు చూసీ చూడనట్టు వదిలేస్తాం. కానీ నువ్వు ఆ స్థాయిని కూడా దాటిపోయి మహా పీఠాధిపతి స్థాయిలో సమాజానికి సందేశాలు ఇస్తాను, సమాజాన్ని ముందుకు నడిపిస్తాను అంటే కచ్చితంగా ఇలాంటి విషయాల గురించి అడుగుతారు. మాకు చెబుతున్నావు కదా... మరి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. 

నేను చట్టప్రకారం విడాకులు తీసుకున్నాను అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు... నిజమే అందులో తప్పేమీ లేదు. ఎన్నో వేలమంది విడాకులు తీసుకుంటున్నారు. నచ్చనప్పుడు కలిసి కాపురం చేయమని ఎవరు చెబుతారు? కానీ...  ఇలాంటివి వరుసగా మూడు జరిగితే... నీలో లోపం ఉందా, లేక వాళ్లలో లోపం ఉందా, నీ ఆలోచన ధోరణిలో లోపం ఉందా, నీ కుటుంబంలో సర్దుబాటు కుదరడం లేదా అని నీ పక్కింట్లో అయినా చర్చకు వస్తుంది. నువ్వు నాయకుడివి కాబట్టి నీ చుట్టూ ఉండే వాళ్లలో చర్చకు వస్తుంది. 

ఇవన్నీ వదిలేసి నువ్వు సందేశాలు ఇస్తున్నప్పుడు ఈ విషయాలు తప్పకుండా చర్చకు వస్తాయి. ఒకరితో ఉన్నప్పుడు ఇంకొకరితో సంతానం పొందాడని వాళ్లే ఆరోపణలు చేసుకుంటున్నారు. సాంకేతికపరంగా, న్యాయపరంగా నువ్వు తప్పు చేశావన్న ఆరోపణ ఉంది. మాజీ భార్యల్లోనే ఒకరు ఆరోపణలు చేశారు. ఇవేమీ మీరు పట్టించుకోవద్దు... నేను చెప్పే నీతులు మాత్రమే పట్టించుకోండి అనడానికి నువ్వు శ్రీ శ్రీ లాగా కవివో, ఇంకెవరివో కాదు. 

రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు... ప్రజలకు సంబంధించిన పనులు చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ తప్పకుండా అడుగుతారు... అడిగినవాటికి చచ్చినట్టు జవాబివ్వాల్సిందే, సంజాయిషీ ఇవ్వాల్సిందే... లేదంటే సిగ్గుతో నోర్మూసుకుని తలదించుకోవాలి" అంటూ సజ్జల నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.


More Telugu News