నటుడు విశాల్‌పై లైకా కేసు.. డబ్బు ఎందుకు చెల్లించలేదని నటుడిని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు

  • విశాల్‌పై లైకా సంస్థ కేసు
  • నటుడి బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా చెల్లించడం లేదన్న లైకా న్యాయవాది
  • సగమైనా చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థన
  • సమయం కావాలన్న విశాల్ న్యాయవాది
  • నవంబరు 1కి విచారణ వాయిదా
నటుడు విశాల్‌పై లైకా సంస్థ వేసిన కేసులో మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విశాల్ బ్యాంకు ఖాతాలో డబ్బులున్నప్పటికీ తమకు చెల్లించడం లేదంటూ లైకా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయం కోర్టుకు ఆయన సమర్పించిన బ్యాంకు లావాదేవీలను బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు. తమకు చెల్లించాల్సిన నగదులో సగమైనా డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించాలని కోరారు. 

స్పందించిన విశాల్ తరపు న్యాయవాది ఈ విషయంలో తమ సమాధానం కోసం కొంత గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయస్థానం..  లైకా సంస్థకు చెల్లించాల్సిన సొమ్ము ఎందుకు తిరిగి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ లైకా సంస్థ చర్చలకు రావడం లేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నవంబరు 1కి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News