ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఆదేశం

  • ఉత్తర గాజా ప్రజలకు 24 గంటల గడువు ఇచ్చిన ఇజ్రాయెల్
  • భూతల యుద్ధానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ సైన్యం
  • దీనివల్ల మానవ హననం ఏర్పడుతుందన్న ఐక్యరాజ్యసమితి
ఇజ్రాయెల్ భూఉపరితల యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు గాజాపై వైమానిక, క్షిపణీ దాడులకే పరిమితం కాగా, భూమిపై నుంచి పూర్తి స్థాయి యుద్ధానికి ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఉత్తర గాజా ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇందుకు 24 గంటల గడువు పెట్టింది. ఉత్తర గాజాలో సుమారు 11 లక్షల మంది నివసిస్తున్నారు. గాజా స్ట్రిప్ జనాభాలో సగం మంది ఇక్కడే ఉంటారు. అయితే, ఇజ్రాయెల్ ఆదేశాల అమలు అసాధ్యంగా ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు గాజా స్ట్రిప్ పై తన దాడులకు మద్దతుగా కొన్ని ఆధారాలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నాటో రక్షణ మంత్రులతో ఇజ్రాయెల్ పంచుకుంది. హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, పౌరుల మృతదేహాల ఫొటోలను చూపించింది. భూమిపై గాజా అన్నదే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించడం తెలిసిందే. ఇజ్రాయెల్ కు చెందిన 150 మందిని బందీలుగా చేసుకున్న హమాస్, దాడులు ఆపకపోతే వారిని అంతం చేస్తామని హెచ్చరించడం తెలిసిందే. బందీలను విడిచి పెట్టేవరకు గాజా నిర్బంధాన్ని ఉపసంహరించేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. 

గాజా, లెబనాన్ పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ మందుగుండు వినియోగిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఆరోపించింది. దీనివల్ల పౌరులకు తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వైట్ ఫాస్ఫరస్ ను వినియోగించడాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించలేదు.


More Telugu News