పాకిస్థాన్ తో మ్యాచ్ కంటే మా అమ్మను చూసేందుకే ప్రాధాన్యత ఇస్తా: బుమ్రా

  • వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ 
  • అహ్మదాబాద్ లో మ్యాచ్
  • అహ్మదాబాద్ బుమ్రా సొంత గడ్డ
  • ఇంటికి వెళ్లి చాలా రోజులైందన్న బుమ్రా
వరల్డ్ కప్ లో తన మూడో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో కాదు... దాయాది పాకిస్థాన్ జట్టే. దాంతో ఈ మ్యాచ్ పై హైప్ మామూలుగా లేదు. అక్టోబరు 14న జరిగే ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ లో కోలాహలం మిన్నంటుతోంది. 

ఇక, అసలు విషయానికొస్తే... టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వస్థలం అహ్మదాబాద్. సొంతగడ్డపై అడుగుపెట్టిన బుమ్రా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం నాడు పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ జరగనున్నప్పటికీ, తన తొలి ప్రాధాన్యత మాత్రం అర్జంటుగా తన తల్లిని చూడడమేనని చెప్పాడు. 

చాలారోజులుగా క్రికెట్ పర్యటనలతోనే సరిపోతోందని, ఇంటికి వెళ్లలేదని బుమ్రా తెలిపాడు. అందుకే, ఇంటికి వెళ్లి మా అమ్మను చూడాలనుకుంటున్నానని, తనకు సంతోషం కలిగించే మొదటి విషయం అదేనని వివరించాడు. 

బుమ్రాకు ఐదేళ్ల వయసు కూడా రాకుముందే తండ్రి చనిపోయాడు. తల్లి దల్జీత్ అన్నీ తానై బుమ్రాను, ఇతర బిడ్డలను పోషించింది. దల్జీత్ ఓ స్కూలు ప్రిన్సిపాల్.

కాగా, సొంతగడ్డ అహ్మదాబాద్ లో బుమ్రా ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే ఓ టెస్టు మ్యాచ్ మాత్రం ఆడాడు. పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వాతావరణం ఉద్విగ్నంగా ఉండబోతోందని, తాను అత్యుత్తమంగా రాణించగలనని అనుకుంటున్నట్టు తెలిపాడు.

బుమ్రా మోడల్, టీవీ ప్రెజెంటర్ సంజనా గణేశన్ ను 2021లో పెళ్లాడాడు. ఇటీవలే తండ్రి అయ్యాడు. అతని భార్య సంజనా గణేశన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.


More Telugu News