హమాస్ రాకెట్లను మధ్యలోనే అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్'.... వీడియో ఇదిగో!

  • అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర పోరు
  • దాడుల తొలిరోజున 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ప్రయోగించిన హమాస్
  • తాజా వీడియో వైరల్
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య అక్టోబరు 7 నుంచి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను గుక్క తిప్పుకోనివ్వకుండా హమాస్ మిలిటెంట్లు రాకెట్లను పెద్ద సంఖ్యలో సంధిస్తున్నారు. 

కాగా, హమాస్ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. హమాస్ ఇటీవల 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ప్రయోగించి, ఇజ్రాయెల్ ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. వాటిలో చాలావరకు ఐరన్ డోమ్ కారణంగా మధ్యలోనే కూలిపోయాయి. కొన్ని మాత్రం ఇజ్రాయెల్ భూభాగంపై నష్టం కలిగించాయి. 

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థలో మూడు విభాగాలు ఉంటాయి. శత్రువులు ప్రయోగించే అస్త్రాలను గుర్తించే రాడార్... ఆ సమాచారాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు చేరవేస్తుంది. ఆ క్షిపణులు/రాకెట్లు జనావాసాలపై పడతాయా, లేక ఖాళీ భూభాగంలో పడతాయా అనేది కమాండ్ అండ్ కంట్రోల్ విశ్లేషిస్తుంది. 

ఒకవేళ ప్రత్యర్థి ఆయుధాలు జనావాసాలపై పడతాయనుకుంటే, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ నుంచి ఇంటర్ సెప్టర్ లకు ఆదేశాలు వెళతాయి. ఇంటర్ సెప్టర్ లు (ఇవి ఒక రకమైన క్షిపణులు) గాల్లోకి లేచి, మార్గమధ్యంలోనే ప్రత్యర్థి క్షిపణులు/రాకెట్లను అడ్డుకుంటాయి.


More Telugu News