పాపం ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు!: బండి సంజయ్ వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్‌కు వెళ్లిందన్న బండి సంజయ్
  • పెద్దసారు ఆమోదం కోసం ఈ లిస్ట్ వెయిట్ చేస్తుందన్న బండి సంజయ్
  • బీఆర్ఎస్ బండారాన్ని ప్రధాని మోదీ బయట పెట్టారన్న కరీంనగర్ ఎంపీ
  • రేవంత్, హరీశ్ రావులు ఇద్దరు బలిచ్చే బకరాలు అన్న బండి సంజయ్
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్‌కు వెళ్లిందని, పెద్ద సార్ ఆమోదం కోసం ఈ లిస్ట్ వెయిట్ చేస్తోందని, కానీ పాపం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ప్రజలు గుర్తించారన్నారు. అందుకే ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ బండారాన్ని ప్రధాని నరేంద్రమోదీ బయట పెట్టారన్నారు. అడ్డామీది కూలీలను తీసుకువచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతోందని ఎద్దేవా చేశారు.

బీజేపీ లిస్ట్ విషయంలో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ జాబితా ఢిల్లీకి వెళ్లిందని, కాంగ్రెస్ జాబితా మాత్రం ప్రగతి భవన్‌కు వెళ్లిందన్నారు. పెద్దసారు కేసీఆర్ ఆమోదం కోసం ఈ జాబితా వెళ్లిన విషయం రేవంత్‌కు తెలియదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చే అవకాశమే లేదన్నారు. వీరిద్దరికి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో చివరకు ఇద్దరు బకరాలు అవుతారని ఒకరు హరీశన్న, రెండోది రేవంతన్న అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో రేవంత్ బకరా అయితే, బీఆర్ఎస్‌లో హరీశ్ రావు బకరా అన్నారు. బీజేపీలో నిజమైన నాయకులు చేరుతున్నారన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ తప్ప అన్ని పార్టీలు తిరిగారన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామన్నారు.


More Telugu News