భారతీయులు ప్రధానంగా వినియోగించే రైస్ వెరైటీలు ఇవే!

  • బాస్మతీ, రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్
  • రంగు, పరిమళం, పోషక విలువల్లో మార్పులు
  • అన్నింటిలోకి బాస్మతి రైస్ ప్రత్యేకం, డిమాండ్ ఎక్కువ
భారతీయ వంటలు ఎంతో ప్రత్యేకమైనవి. ఎంతో ఘన వారసత్వం కలిగినవి. అన్నింటిలోకీ ఎక్కువ మంది వినియోగించేది రైస్ (బియ్యం). రైస్ తో పాటు గోధుమను ఎక్కువ మంది ప్రధాన ఆహారంగా రోజువారీ వినియోగిస్తుంటారు. ప్రపంచంలో రైస్ అత్యధికంగా పండే రెండో దేశం భారత్. మన దేశంలో ప్రధానంగా వినియోగించే కొన్ని రైస్ వెరైటీలు ఇవి..

బాస్మతి రైస్
దీనినే బిర్యానీ రైస్ అంటారు. రైస్ లో రారాజుగా చాలా మంది అభివర్ణిస్తుంటారు. గాడ్ ఆఫ్ గ్రెయిన్స్ గానూ పిలుస్తారు. వాయవ్య భారత్ లో ఇది ఎక్కువగా పండుతుంది. బాస్మతి బియ్యానికి ప్రత్యేక పరిమళం ఉంటుంది. చాలా పొడవుగా బియ్యం ఉంటాయి. నాణ్యత కూడా ఎక్కువే. అందుకే బిర్యానీ, పులావ్ కు దీన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. 

రెడ్ రైస్
చూడ్డానికి ఎర్రగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తుంటారు. థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, భారత్ లో దీన్ని ఎక్కువగా పండిస్తుంటారు. మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దీని సాగు చేస్తారు. ఇందులో పోషక విలువలు ఎక్కువ. యాంథోసియాన్ అనే పిగ్మెంట్ వల్ల బియ్యానికి ఎర్రటి రంగు ఏర్పడింది. 

బ్లాక్ రైస్
బాస్మతి మాదిరే బ్లాక్ రైస్ పొడవుగా, నల్లటి రంగుతో ఉంటుంది. ఈశాన్య భారత్ లోని మణిపూర్, అసోం రాష్ట్రాల్లో ఇది సాగవుతోంది. యాంథోసియాన్ అధిక పరిమాణంలో ఉండడం వల్ల బియ్యానికి నల్లటి రంగు ఏర్పడింది. యాంథోసియాన్ ను యాంటీ ఆక్సిడెంట్ గా పరిగణిస్తారు. పోషకాలు ఎక్కువగా ఉండడంతో రాజకుటుంబాలే పూర్వం ఈ ధాన్యాన్ని వినియోగించేవి. 

వైట్ రైస్
ఎక్కువ మందికి తెలిసి, వినియోగంలో ఉన్న రకం ఇది. ఇందులోనూ ప్రాంతాల వారీగా ఎన్నో రకాలను చూడొచ్చు. ఈ రైస్ ద్వారా ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, శక్తి లభిస్తాయి. దక్షిణాదిన సోనా మసూరీ, బెంగాల్ లో గోవిందోబాగ్, తమిళనాడులో వడకోలమ్ ప్రాచుర్యం పొందిన రకాలు.


More Telugu News