మధుమేహం ఉందని, విమానం నుంచి మహిళను దించేసిన సిబ్బంది!

  • బ్రిటన్ లో చోటు చేసుకున్న ఘటన
  • అలసిపోయినట్టుగా ఉండడంతో దింపేసిన సిబ్బంది
  • ఎంత చెప్పినా వినిపించుకోని వైనం
మధుమేహంతో బాధపడుతున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. బ్రిటన్ కు చెందిన 56 ఏళ్ల మహిళ టేలర్ తన భర్తతో కలసి రోమ్ కు వెళ్లేందుకు ఫ్లయిట్ ఎక్కారు. కొంత అసౌకర్యంగా కనిపించడంతో విమాన సిబ్బంది ఆమెను కిందికి దింపేశారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా, ఇలా దింపేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. టాయిలెట్ కు వెళ్లి తిరిగొచ్చే సమయంలో చాలా అలసిపోయినట్టుగా అనిపించడంతో సిబ్బంది ఇలా వ్యవహరించినట్టు తెలిసింది.

‘‘నేను బాగానే ఉన్నాను. రక్తంలో షుగర్ స్థాయుల్లో మార్పు వచ్చి ఉంటుంది. కూర్చుని, రిలాక్స్ గా నీరు తాగితే చాలు సర్దుకుంటుంది’’ అని చెప్పినప్పటికీ క్యాబిన్ క్రూ సిబ్బంది పట్టించుకోలేదని వెల్లడించారు. మెనోపాజ్ దశ వల్ల చెమటలు పట్టేసరికి, ఆమెకు ఏదో జరుగుతోందని విమానం స్టాప్ భయపడిపోయారట. టేలర్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా, వైద్య పరీక్షలకు వెళ్లాల్సిందేనని సూచించారు. పది నిమిషాల తర్వాత వచ్చి విమానం దిగి వెళ్లిపోవాలని, ఆమెకు సంబంధించి ప్లయిట్ రిస్క్ ఉందని చెప్పారు.

హెల్త్ రిస్క్ ఉందని భావించినప్పుడు కనీసం వైద్యపరమైన సాయం కూడా అందించలేదని టేలర్ మండిపడుతున్నారు. కస్టమర్ల భద్రతే తమకు ప్రధానం అని ఎయిర్ లైన్స్ సంస్థ స్పష్టం చేసింది. వైద్య నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఎవరైనా ప్యాసింజర్ ఆరోగ్యం రిస్క్ లో ఉందనిపిస్తే సాధారణంగా వారిని ప్రయాణించేందుకు అనుమతించరు.


More Telugu News