వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి నరకయాతన.. వీడియో ఇదిగో!

  • జనరల్ వార్డులోనే కూతురుకు పురుడు పోసిన తల్లి
  • ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • వైద్యుల తీరుపై మండిపడుతున్న బాధితురాలి బంధువులు
పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళ పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారు. నొప్పులు వస్తున్నా వైద్యులు కానీ, నర్సులు కానీ పట్టించుకోలేదు. జనరల్ వార్డులో చేర్చుకుని వదిలేశారు. దీంతో మరో దారిలేక బంధువులతో కలిసి తల్లి తన కూతురుకు పురుడు పోసింది. అంతా సవ్యంగా జరగడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నా వైద్యులు పట్టించుకోకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుందీ ఘటన. ప్రసవ వేదనతో వచ్చిన మహిళను జనరల్ వార్డులో చేర్చుకున్న సిబ్బంది.. ఆపై పట్టించుకోకపోవడంతో ఆ గర్భిణి నరకయాతన అనుభవించింది.

తొలుత తనను లేబర్ రూమ్ కు తీసుకెళ్లిన సిబ్బంది, కాసేపటికి అక్కడి నుంచి మరో రూమ్ కు తీసుకెళ్లారని బాధితురాలు తెలిపింది. అక్కడ పురుషులు కూడా ఉండడంతో తాను ఇబ్బంది పడ్డానని చెప్పింది. దీంతో తనను మళ్లీ జనరల్ వార్డుకు తీసుకు వచ్చి వదిలేశారని వివరించింది. ఓవైపు నొప్పులు ఎక్కువవుతున్నా నర్సులు కానీ డాక్టర్లు కానీ పట్టించుకోలేదని ఆరోపించింది. చివరకు తన తల్లి, పెద్దమ్మ కలిసి తనకు డెలివరీ చేశారని వివరించింది. కాగా, పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నా కూడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



More Telugu News