5 వేల సంవత్సరాలుగా భారత్ లౌకిక రాజ్యమే.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

  • ‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకాన్ని రచించిన ఆరెస్సెస్ కార్యకర్త
  • మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటిచెప్పేలా దేశాన్ని తయారుచేయాలన్న భగవత్
  • లోక కల్యాణం కోసమే మునులు భారత్‌ను సృష్టించారన్న ఆరెస్సెస్ చీఫ్
భారత్ 5 వేల ఏళ్లుగా లౌకిక దేశమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. దేశ ప్రజలు కలిసి ఉండాలని, ప్రపంచం ముందు మానవ ప్రవర్తనకు అత్యుత్తమ ఉదాహరణగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ కార్యకర్త రంగాహరి రచించిన ‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకావిష్కరణలో నిన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభూమిపై భక్తి ప్రదర్శించాలని, ప్రేమగా, అంకితభావంతో మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ ఐక్యతకు మాతృభూమిని మనం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. 

‘‘మన 5 వేల ఏళ్ల సంస్కృతి లౌకికమైనదే. అన్ని తత్వజ్ఞానాల్లోనూ ఇదే ఉంది. ఈ మొత్తం ప్రపంచం ఒకే కుటుంబమనేది మన భావన. ఇది సిద్ధాంతం కాదన్న విషయన్ని తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి’’ అని భగవత్ పేర్కొన్నారు. 

దేశంలో వైవిధ్యం చాలా ఉందని, ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దని సూచించారు. మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దేశాన్ని తయారుచేయాలని ఉద్బోధించారు. లోక కల్యాణం కోసమే మన మునులు భారత్‌ను సృష్టించారని, దేశంలోని చివరి వ్యక్తికి కూడా తమ జ్ఞానాన్ని అందించే సమాజాన్ని సృష్టించారని భగవత్ వివరించారు.


More Telugu News